Khairatabad Ganesh: ఖైరతాబాద్ భారీ గణనాధుని రూపం ఆవిష్కరణ.. గణపయ్య రూపంతోపాటు మరో ప్రత్యేకత ఉంది..
Khairatabad Ganesh: వరల్డ్ ఫేమస్ గణనాథుడిగా ఇక్కడి విగ్రహానికి పేరుంది. ఈసారి గణనాథుడిని శ్రీ పంచముఖ మహా లక్ష్మీగణపతి అవతారంలో దర్శనమివ్వనున్నారు. అది కూడా 50 అడుగుల ఎత్తైన మట్టి గణేషుడిని రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఖైరతాబాద్ గణేష్ అంటే చెప్పేదేముందీ.. ఆ ఎత్తే వేరు, ఆ బందోబస్తే వేరు. వరల్డ్ ఫేమస్ గణనాథుడిగా ఇక్కడి విగ్రహానికి పేరుంది. ఈసారి గణనాథుడిని శ్రీ పంచముఖ మహా లక్ష్మీగణపతి అవతారంలో దర్శనమివ్వనున్నారు. కళ్లు చెదిరేలా 50 అడుగుల భారీ విఘ్నేశ్వరుని నమూనా చిత్రాన్ని విడుదల చేసింది ఉత్సవ కమిటీ. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మీ గణపతి అవతారంలో విశ్వరూప గణపతిని ప్రతిష్టించనున్నారు. ఐతే ఈ లంబోదరునికి ఓ ప్రత్యేకత ఉంది. ఈసారి గ్రీన్ గణపతిని రూపొందిస్తున్నారు. అంటే తొలిసారిగా మట్టితో భారీ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. గణనాథునికి కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి..ఎడమవైపున త్రిశక్తి మహాగాయత్రీ దేవి దర్శనమివ్వనున్నారు. ఎప్పుడూ ప్రతిష్టించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమ కంటే మరింత స్ట్రాంగ్‌గా మహా గణపతిని నిర్మిస్తున్నట్టు తెలిపింది ఉత్సవ కమిటీ.
ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ పిలుపునిచ్చారు నిర్వాహకులు. గడిచిన 68 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదట ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని 1954లో ప్రతిష్ట చేశారు. అలా.. 2014 వరకు ఏటా ఒక అంగుళం పెంచుకుంటూ 60 ఫీట్ల అత్యంత ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని నిర్మిస్తూ వచ్చారు. పర్యావరణ వేత్తల సూచనలు, తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆ తర్వాత ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరో రెండు నెలల్లో విగ్రహ తయారీ పూర్తవుతుందని.. రెండు రోజుల ముందుగానే స్వామి వారు ఉత్సవాలకు సిద్ధం అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్, ప్రభుత్వ సూచనలతో మట్టి విగ్రహా తయారీకే మొగ్గు చూపిన ఉత్సవ కమిటీ.. 50 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ నెల 10న కర్రపుజాతో ప్రారంభమైన పనులు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఈ ఏడాది మహా గణపతి రూపం థీమ్, మట్టి గణపతి నిమజ్జన అంశాలపై ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుని వెల్లడించారు.