కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం
Telangana CM K. Chandrashekar Rao: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే మరణాలు...
Telangana CM K. Chandrashekar Rao: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే మరణాలు పెద్దగా ఉండటం లేదు. అయితే పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు మాత్రం బాగానే ఉంటుంది. ఇక కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు సమీక్ష నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెమిడెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్, బెడ్ల లభ్యతలో ఎలాంటి లోపం ఉండరాదని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ సమన్వయంతో పని చేసి రాష్ట్రాన్ని కరోనా బారి నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం సూచించారు.
ఇక ఈటల రాజేందర్ వద్ద ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈటలపై భూ అక్రమణల ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖను తనకు కేటాయించాలని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సిఫారసు చేశారు. దీంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ కేసీఆర్ ఆధీనంలోకి రావడంతో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ చర్యల్లో భాగంగా తన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని కరోనా పర్యవేక్షణకు నియమించారు.