ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. మొదటి విడతగా లక్ష ఆర్థిక సాయం
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వాళ్లకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. లబ్దిదారులకు సీఎం రేవంత్ స్వయంగా చెక్కులు పంపిణీ చేశారు. మొదటి విడతగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ సారి లుక్కేయండి.

కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనుకుంటున్న సీఎం రేవంత్ వాళ్లకు తీపి కబురు అందించారు. శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి దశ లబ్దిదారులకు.. చెక్కుల పంపిణీ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా వేర్వేరు జిల్లాలకు చెందిన 12మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొదటి విడత చెక్కులు అందించారు. లబ్దిదారుల్లో రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లావాసులున్నారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన లక్ష్మి పథకం బిల్లు కింద లక్ష రూపాయల చెక్కును అందుకున్నారు. మరికొంతమంది అర్హులైన పేదలకు కూడా కార్యక్రమంలో లక్ష రూపాయల చొప్పున తొలి విడత ఆర్థిక సాయం అందించారు. ఇళ్ల నిర్మాణ దశలవారీగా మొత్తం 5లక్షల రూపాయలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. బేస్‌మెంట్ తర్వాత లక్ష.. గోడలు పూర్తయ్యాక లక్షా 25వేలు.. శ్లాబ్ తర్వాత లక్షా 75 వేలు.. ఇళ్లు మొత్తం పూర్తయ్యాక లక్ష రూపాయలు అందించనున్నారు.
మొబైల్ యాప్‌లో ఇళ్లకు సంబంధించిన ఫోటోలు అప్‌లోడ్ చేస్తే నేరుగా ఖాతాలో డబ్బు జమకానుంది. ఇళ్ల నిర్మాణం 400 నుంచి 600 స్వేర్ ఫీట్ మధ్య ఉండాలని సూచించింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించనుంది. తొలి దశలో అత్యంత నిరుపేదలు, నిజమైన అర్హులను గుర్తించి వాళ్లకు ఇళ్లు మంజూరు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో పేద వర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.