TRS-BJP Clashes: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్-బీజేపీ వర్గాల తోపులాట.. ఇరువర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తం..!
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.
Huzurabad Clash Between TRS – BJP Leaders: కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు పోటా పోటీగా పాదయాత్రలు, ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇదే క్రమంలో అంబేద్కర్ కూడలిలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు తరసపడ్డారు. దీంతో పోటాపోటీగా నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని.. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
దళితులను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. అదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. దాన్ని తెరాస వర్గాయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు.ఈ క్రమంలో హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమున పాలాభిషేకం చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ వర్గీయులు అక్కడకు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్ ప్లెక్సీలు తగులబెట్టేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను అడ్డుకొని నిలువరించారు.