అనంత్ అంబానీ వంతారా నుంచి హైదరాబాద్ జూపార్క్‌కు త్వరలో అతిథులు!
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు త్వరలో కొత్త అతిథులు రానున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా నుంచి ఒక కంగారూ జంట ఒక మగ, ఒక ఆడ హైదరాబాద్ జూ పార్క్‌కు రానున్నాయి. దీనికి ప్రతీగా వంతారాకు ఒక ఏనుగును ఇవ్వనున్నారు.

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు త్వరలో కొత్త అతిథులు రానున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా నుంచి ఒక కంగారూ జంట ఒక మగ, ఒక ఆడ హైదరాబాద్ జూ పార్క్‌కు రానున్నాయి. దీనికి ప్రతీగా వంతారాకు ఒక ఏనుగును ఇవ్వనున్నారు. ఇదే తరహా మార్పిడి కార్యక్రమంలో ఈ ఏడాది అక్టోబర్‌లో మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ జూకు రెండు మగ, ఒక ఆడ జీబ్రాలు వచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్ నుంచి 20 మౌస్ డీర్‌లను వంతారాకు తరలించారు.
కంగారూ జంట వచ్చే వారం హైదరాబాద్ జూపార్క్‌కు చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ జూ పీఆర్‌ఓ హనీఫుల్లా తెలిపారు. వాటికోసం అవసరమైన ఎంక్లోజర్ 2020 నుంచే సిద్ధంగా ఉంది అని ఆయన చెప్పారు. కంగారూలతో పాటు ఒక వాలబీ జంట కూడా జూకు రానుంది. అదేవిధంగా మైసూరు జూ నుంచి ఒక ఆడ జిరాఫీని కూడా తీసుకురానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జూలో ఉన్న ‘సన్నీ’ అనే మగ జిరాఫీకి తోడుగా ఈ ఆడ జిరాఫీని తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర జూలతో పాటు హైదరాబాద్ జూ పార్క్ అధికారులు పలు జంతు మార్పిడి కార్యక్రమాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని సెంట్రల్ జూ అథారిటీ (CZA) అనుమతికి వేచి ఉన్నాయి. 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దాదాపు 100 రకాల పక్షులు, జంతువులు, సర్పాలు ఉన్నాయి. భారతీయ ఖడ్గమృగం, ఆసియాటిక్ సింహం, బెంగాల్ పులి, ప్యాంథర్, గౌర్, భారతీయ ఏనుగు, స్లెండర్ లోరిస్, పైథాన్‌తో పాటు వివిధ రకాల జింకలు, యాంటిలోపులు, పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక, నెహ్రూ జూలాజికల్ పార్క్ సమీపంలో ఉన్న మీర్ ఆలమ్ చెరువు ప్రతి ఏడాది వందలాది వలస పక్షులను ఆకర్షిస్తూ, నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు మరింత అందాన్ని, ఆకర్షణను తీసుకువస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




