Kancha Gachibowli Land Row: హెచ్‌సీయూ భూవివాదంపై మంత్రుల కమిటీ.. వివాద పరిష్కారానికి దిశగా చర్యలు
కంచ గచ్చిబౌలిలోని భూములపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు మొదలైంది. మంత్రులతో కమిటీ ముందు ఎవరు ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది ఒక ఎత్తయితే.. భూముల విషయంలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ వివరాలు ఇలా

తెలంగాణలో వివాదం రేపిన కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఓ కమిటీ వేసింది. మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, పొంగులేటితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు, సమాధానాలు వెతికేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో సంబంధం ఉన్న వారితో సంప్రదింపులు జరపనున్నారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన.. 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చిందన్న సుప్రీంకోర్టు.. తెలంగాణ సీఎస్‌పై సీరియస్ అయింది. అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని ప్రశ్నించింది. అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారు.. పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల్లో ఈ నెల 7 వరకు చెట్లు కొట్టేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది హైకోర్టు. ఇది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల విజయమన్నారు కేటీఆర్. కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తే చట్టం ఊరుకోదన్నారు హరీష్ రావు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేసే ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 7న హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ముగ్గురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది అనేది కూడా కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి