Telangana: కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా..! మండు వేసవిలో జోరు వర్షాలు.. ఈ జిల్లాలకు
మండు వేసవిలో జోరువాన కురిసింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వానలు దంచికొట్టాయి. వర్షాకాలాన్ని తలపించాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. తెలంగాణలో కొన్నిచోట్ల పంటనష్టం జరిగింది. రెండు రాష్ట్రాల్లో పిడుగులు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరో మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట నష్టంతో పాటు పిడుగుపాటుకు పలువురు గాయపడ్డారు. తెలంగాణలో ఇవాళ కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కూడా ఉండటంతో.. 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. లోయర్ ట్యాంక్‌బండ్, చార్మినార్,ఉప్పల్, సరూర్‌నగర్, బండ్ల గూడ, బాలానగర్ ప్రాంతాల్లో జోరు వాన పడింది. రోడ్లు జలమయం అయ్యాయి.
నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయింది. హిమాయత్‌నగర్‌లో అత్యధికంగా 9.1, చార్మినార్‌లో 9 సెం.మీ.. సరూర్‌నగర్‌లో 8.9, నాంపల్లిలో 8.8 సెం.మీ వర్షపాతం నమోదయింది. ముషీరాబాద్‌లో 8.7, అంబర్‌పేటలో 8.5, బండ్లగూడలో 8.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. షేక్‌పేట్‌లో 8, బాలానగర్‌లో 7.7, మారేడ్‌పల్లిలో 7.6, అంబర్‌పేటలో 7.4సెం.మీ. వర్షపాతం నమోదయింది.
ఏపీలో ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇవాళ అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం.. అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల్లో పిడుగు పాటు గురై ఆరుగురు చనిపోయారు. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి.
మరోవైపు ఆంధ్రాలో నిన్న నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే.. కృష్ణా జిల్లాలో అత్యధికంగా.. 6.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా 6.5 సెం.మీ.. అన్నమయ్య జిల్లా 5.7 సెం.మీ.. నంద్యాల జిల్లా 4.3 సెం.మీ.. ఎన్టీఆర్ జిల్లాలో అత్యల్పంగా 3.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు అన్నమయ్య జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అంతనరాజుపేటలో రెండు ఇళ్లు కూలిపోయాయి. అలాగే పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీగా కురిసిన వర్షానికి నియోజకవర్గంలో పలు పంటలు దెబ్బతిన్నాయి. నల్లమాడ మండలంలో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి