Sarpanch Navya: ఇదిగో శివంగి.. ఈమెలా పోరాడండి… నిలబడండి.. గెలవండి

అమ్మాయిలూ, మహిళలూ.. అణిచివేతలను.. భరించాల్సిన అవసరం లేదు. వేధింపులను పంటి బిగువన దాచాల్సిన అవసరం లేదు. ఇది ఆధునిక సమాజం. అపర కాళిగా మారి తప్ప చేసినవారి తోలు తీయండి. సర్సంచ్ నవ్యని చూసి స్ఫూర్తి పొందండి.

Sarpanch Navya: ఇదిగో శివంగి.. ఈమెలా పోరాడండి... నిలబడండి.. గెలవండి
Sarpanch Navya
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2023 | 4:44 PM

అతడు మాజీ డిప్యూటీ సీఎం, ప్రజంట్ నియోజకవర్గ ఎమ్మేల్యే. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. తండ్రి వయస్సు ఉన్న అతగాడి లైంగిక వేధింపులను సహించలేకపోయింది ఆ మహిళా సర్పంచ్. శివంగిలా తిరగబడింది. ఏకంగా మీడియా ముందుకు వచ్చి తన బాధను వెళ్లగక్కింది. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఒత్తిళ్లు వచ్చినా.. చెదరని ఆత్మవిశ్వాసంతో.. వెనక్కి తగ్గలేదు. అధిష్ఠానం కూడా ఆమె బాధను అర్థం చేసుకుని అండగా నిలిచింది. వేధింపులకు గురి చేసిన ఎమ్మేల్యేపై అక్షింతలు వేసి.. సర్పంచ్ ఇంటికి వెళ్లి సారీ చెప్పాలని ఆదేశించింది. అలా పోరాడి.. నిలిచి.. గెలిచి.. ఎమ్మెల్యేనే తన కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. ఆ వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య  కాగా.. బాధితురాలు.. జానకీపురం సర్పంచ్ నవ్య.

ఎమ్మేల్యే ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆమె వాయిస్‌లో బేస్ తగ్గలేదు. ఆమె ధైర్యం చెక్కుచెదరలేదు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది నవ్య. మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని.. అసభ్యంగా ప్రవర్తిస్తే తాటతీస్తానని హెచ్చరించింది.  పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని.. మహిళలను వేధిస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించేందుకైనా సిద్ధమంటూ ఉద్వేగంగా మాట్లాడింది నవ్య. తాను మాట్లాడిన ప్రతి మాట నిజం అని ఆమె మరోసారి స్పష్టం చేసింది. అన్యాయాలు, అరాచకాలను మహిళలు సహించవద్దని ఆమె పిలుపునిచ్చింది. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సర్పంచ్ నవ్య. ఎమ్మెల్యే రాజయ్య టికెట్ ఇవ్వడం వల్లే సర్పంచ్‌ అయ్యానని.. పార్టీని ఒక కుటుంబంలా భావించి.. తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తానని ఆమె పేర్కొంది.

జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించమని కోరుతున్నానని పేర్కొన్నారు. జానకిపురం అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. తన ఎమ్మేల్యే నిధుల నుంచి రూ.25 లక్షలు తక్షణమే గ్రామ అభివృద్ధికి మంజూరు చేస్తున్నట్లు రాజయ్య తెలిపారు.

ప్రెస్ మీట్‌ విజువల్స్ గమనిస్తే.. నవ్య ఇల్లు చాలా చిన్నది.. పెద్దగా స్థితిమంతుల కుటుంబం కాదు. దళిత బిడ్డ. సర్పంచ్ అయ్యి ఊరిని బాగు చేయాలని అనుకుంది. ప్రభుత్వంలోని పెద్ద తలే.. అనుచితంగా ప్రవర్తిస్తే.. గమ్మున ఉండలేదు. గుమ్మం బయటకు వచ్చి.. గొంతెత్తింది. వేధింపులను, అణిచివేతలను తెలంగాణ సమాజం భరించదు అనడానికి నవ్య పోరాడిన తీరు మరో ఉదాహారణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం