Telangana: ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష.. మెజార్టీ కోల్పోతే ఇక అంతే సంగతులు..

| Edited By: Srikar T

May 08, 2024 | 2:56 PM

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎పై జెండా ఎగరువేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విశ్వప్రయత్నాలు‌ చేస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం మేము రేసులోనే ఉన్నామంటూ దూసుకొస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తుంటే.. ఇంచార్జ్ మంత్రి‌ సీతక్క వ్యూహరచనతో కాంగ్రెస్ సైతం సై అంటే సై అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నిలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‎గా మారింది. కార్యకర్తలు కష్టపడుతున్నా.. అక్కడక్కడా వినిపిస్తున్న అసమ్మతి రాగంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి మూడు పార్టీల్లోను‌ కనిపిస్తోంది.

Telangana: ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష.. మెజార్టీ కోల్పోతే ఇక అంతే సంగతులు..
Telangana Elections
Follow us on

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎పై జెండా ఎగరువేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విశ్వప్రయత్నాలు‌ చేస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం మేము రేసులోనే ఉన్నామంటూ దూసుకొస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తుంటే.. ఇంచార్జ్ మంత్రి‌ సీతక్క వ్యూహరచనతో కాంగ్రెస్ సైతం సై అంటే సై అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నిలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‎గా మారింది. కార్యకర్తలు కష్టపడుతున్నా.. అక్కడక్కడా వినిపిస్తున్న అసమ్మతి రాగంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి మూడు పార్టీల్లోను‌ కనిపిస్తోంది. అయితే మొదట ఇంట గెలిచి రచ్చ గెలవాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావించకపోవడంతో మొదటికే మోసం వచ్చేలా పరిస్థితులు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి లెక్కలెంతా.. అసెంబ్లీ‌లో దక్కిన మెజార్టీ నిలిచేది ఎందరికి..? చరిష్మా తగ్గి చతికిల పడితే కష్టమేనా.?

ఆదిలాబాద్ ఎంపి సీటు మూడు పార్టీలకు అగ్ని పరీక్షగానే మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని‌ ఏడు అసెంబ్లీ‌ నియోజకవర్గాల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్, ఒక సీటును కాంగ్రెస్‎ను గెలుచుకుంది. ఇలా మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో గెలుపు లెక్కలు పక్కనపెడితే ఏడు నియోజకవర్గాల్లో కలిపి మెజార్టీని మాత్రం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీనే సాధించింది. కేవలం బోథ్ , ఆసిఫాబాద్ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ 46,5476 ఓట్లను సాధించుకుని అగ్ర భాగాన నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కలిపి 15,17,681 ఓట్లకు‌గాను 13,07,563 ఓట్లు పోలవగా.. ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ మొత్తం ఓట్లలో 4,48,961 ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో 2,52,286 ఓట్లను కైవసం చేసుకుని మూడవ స్థానానికి పరిమితం అయింది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లోకి చేరికలు సాగడంతో క్యాడర్ బలం, బలగం పెరిగి గంప గుత్తగా ఓటు బ్యాంకును కైవసం చేసుకోగలిగింది హస్తం పార్టీ. అయితే బలం పెరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఎదురవుతోంది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడం పార్లమెంట్ పరిధిలోనే ఏకైక అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజక వర్గం కూడా ఖానాపూర్ కావడంతో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెడ్మ బొజ్జుపై భారం ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడగా.. కాంగ్రెస్ 58,870 ఓట్ల సాధించి.. ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్‎పై 4,702 ఓట్ల తేడాతో విజయం సాధించింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ మెజార్టీ కాంగ్రెస్ ఖాతాలోనే ఉంటుందా లేక పక్క పార్టీకి వెలుతుందా అన్న టెన్షన్ ఎమ్మెల్యే వర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ఎత్తున కొనసాగగా.. బీజేపీ సైతం ఈ నియోజక వర్గంపై ప్రత్యేక‌ ఫోకస్ పెట్టడంతో ఖానాపూర్‎లో మెజార్టీని పునరావృతం చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్రంగానే శ్రమించక తప్పడం లేదు. అయితే పార్లమెంట్ పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో మిగిలిన నియోజక వర్గాల్లోను ‌ప్రచారం చేయాల్సి రావడంతో సొంత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఇటు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‎తో లీడర్లను కాపాడుకోవడంతో పాటు.. అటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం కత్తిమీద సాములా మారింది. ఆదివాసీ నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, బోథ్‎లో బీఆర్ఎస్ విజయం సాధించినా.. ఆసిఫాబాద్‎లో కాంగ్రెస్ జెట్ స్పీడ్‎తో పుంజుకోవడం.. ఇటు బోథ్‎లో బీజేపీ చాపకింద నీరులా విస్తరించడంతో రెండు నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలనే ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. బోథ్‎లో కోవ లక్ష్మి 83,036 ఓట్లను‌ సాధించి 22,798 వేల భారీ ఆధిక్యంతో కాంగ్రెస్‎పై విజయం సాధించగా.. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడం మైనస్‎గానే మారింది. అయితే బీఆర్ఎస్ ఎంపి‌ అభ్యర్థి సొంత నియోజక వర్గం కావడం.. ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పాజిటివ్ టాక్‎తో బీఆర్ఎస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ మెజార్టీని కాపాడుకునే అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు బోథ్‎లోను బీఆర్ఎస్ గెలుపొందగా.. మారిన రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తన మెజార్టీని పార్లమెంట్ ఎన్నికల్లోను కంటిన్యూ చేసేందుకు తీవ్రంగా చెమటోడ్చక తప్పని పరిస్థితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అనిల్ జాదవ్ 76,792 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి సోయం బాపురావు బీజేపీపై 22,800 ఓట్ల మెజర్టీని‌ సాదించగా.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మెజార్టీని‌ కాపాడుకోవడం కత్తి మీద సాములాగే మారిందని తెలుస్తోంది. ఈ నియోజక వర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ , బీజేపీలు పోటాపోటీ ఆపరేషన్ ఆకర్ష్‎తో బీఆర్ఎస్‎కు గడ్డుకాలం ఎదురవగా.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాత్రం తీవ్రంగా శ్రమిస్తుండటం కలిసొచ్చే అంశం.

అటు నాలుగు స్థానాలను‌ గెలుచుకున్న బీజేపీ.. పార్లమెంట్ సిట్టింగ్ సీటును కాపాడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి నిలవాలని విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితులు బీజేపీ ఎమ్మెల్యే లకే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బారీ మెజార్టీతో విజయం సాదించిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజెఎల్పీగా కొనసాగుతుండటంతో ఈ పార్లమెంట్ లో బీజేపీ గెలుపు బాధ్యతలు అదనపు భారం మహేశ్వర్ రెడ్డి మోయక తప్పడం లేదు. ఈ నియోజక వర్గంలో 10,6400 ఓట్లు సాధించి ఏకంగా 50,703 ఓట్లతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ( బీఆర్ఎస్ ) మట్టికరిపించడం బీజేపీకి బూస్ట్ నిచ్చింది. తాజా పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్‎గా తీసుకున్న కాంగ్రెస్ నిర్మల్ జిల్లా మీద ప్రత్యేక‌ఫోకస్ పెట్టగా.. నిర్మల్‎ను కాంగ్రెస్‎కు అడ్డాగా మార్చేందుకు భారీ ఆపరేషన్ ఆకర్ష్‎ను కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగానే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి‌ని పార్టీలోకి చేర్చుకోవడంతో బీఆర్ఎస్‎కు ఈ నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలినట్టైంది. పార్లమెంట్‎లో బీఆర్ఎస్ సాధించిన 55,697 ఓట్లలో సగానికిపైగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‎కు పడే అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 28,642 ఓట్లను‌ సాధించుకోగలిగిన‌ కాంగ్రెస్.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా పుంజుకుని బీజేపీకి సవాల్ విసిరే అవకాశం ఉంది. అయితే నిర్మల్ నియోజవర్గంలో బీజేపీ వైపు ఇక్కడి ప్రజానికం నిలవనుండటంతో మహేశ్వర్ రెడ్డి ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు దూసుకెళుతున్నట్టుగానే తెలుస్తోంది.

ఇక ఆదిలాబాద్‎ను కాషాయ అడ్డాగా మార్చుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో‌ ఇదే స్థాయి ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‎కు తెరలేపినా.. అదే స్థాయిలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా సాగుతుండటంతో కలిసొచ్చే కాలానికి నడిచి రాని మెజార్టీగానే ఈ నియోజకవర్గం కనిపిస్తోంది. ఈ నియోజక వర్గంలో బీజేపీ 67,608 ఓట్లను సాధించడంతో పాయల్ శంకర్ తొలిసారిగా అధ్యక్షా అనే అవకాశం దక్కించుకోగా.. రాజకీయ‌చతురతతో సిట్టింగ్ ఎంపిని కాదని బీజేపీ అభ్యర్థిగా గోడెం నగేష్‎కు ఎంపి టికెట్ దక్కడంలో చక్రం తిప్పారన్న పేరుంది. దీంతో పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లోను తన బలం పెంచుకోవాలని పాయల్ ప్రయత్నిస్తుంటే.. వర్గపోరు ఆయనను వెనక్కి లాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మొదట ఇంట గెలవాల్సిన పరిస్థితి పాయల్ శంకర్‎కు అత్యవసరంగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే బీజేపీ అనుబంధ సంఘాల బలం కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ ఈ నియోజక వర్గంలో బలపడినా.. ఆపరేషన్ ఆకర్ష్ ఫలితం కాంగ్రెస్‎కు దక్కినా బీజేపీకి అసెంబ్లీ తరహా మెజార్టీ దక్కడం కష్టమే అన్న టాక్ కూడా లేకపోలేదు.

ఇక సిర్పూర్ , ముధోల్ నియోజక వర్గాలు సైతం బీజేపీకి కంచుకోటగా మారగా.. ఈ రెండు నియోజక వర్గాల‌ ఎమ్మెల్యేలకు మెజార్టీని‌ కాపాడుకోవడం కత్తిమీద సాములాగే మారింది. ముధోల్‎లో బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన డోకా ఏం లేదన్న ప్రచారం ఉన్నా.. అధికార పార్టీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్‎తో అన్నంత పని చేసేందుకు‌ సిద్దమవడం కూడా ముధోల్‎లో ఎమ్మెల్యే రామరావు పటేల్‎కు కష్టకాలంగానే మారిందని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 98,252 ఓట్లతో 23,999 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లోను ఆ మెజార్టీని దక్కించుకుంటుందా లేదా చూడాలి. ఇక సిర్పూర్‎లోను అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హావా కొనసాగగా.. మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‎తో ఇక్కడ బీఆర్ఎస్ ఖాళీ అయింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‎లోకి చేరడంతో హస్తం పార్టీ రెట్టింపు ఉత్సహాంతో కనిపిస్తుండగా.. బీజేపీ సంప్రదాయ ఓటును నమ్ముకుని సాగుతోంది. ఇక్కడ బీజేపీ 63,702 ఓట్లను‌ సాధించి సమీప అభ్యర్థి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు‌కోనప్పపై కేవలం‌ 3,088 ఓట్లతో గట్టెక్కగా.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే సిర్పూర్‎లో మెజార్టీ కీలకం కావడంతో ఇంట గెలవాల్సిన అత్యవసర పరిస్థితి ఎమ్మెల్యే పాల్వాయి హారీష్ బాబు ముందుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటును ఏ పార్టీ సాదించినా సొంత నియోజకవర్గంలో మెజార్టీని మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలు సాధించక తప్పని పరిస్థితి. సో.. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీని సాధించుకున్న తీరుగానే.. నాలుగు రోజుల్లో‌ రానున్న ఓట్ల పండుగలో తిరిగి‌సత్తా చాటి.. తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారో.. లేక ప్రతికూల పరిస్థితులతో వెనకబడిపోతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..