AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP on PV Family: తెలుగు తేజంతో రాజకీయ బంధుత్వం కలుపుకుంటోందా..? మరో పీవీ చుట్టూ రాజకీయం..

మన ఠీవీ పీవీని బీజేపీ ఓన్‌ చేసుకుంటోందా ? తెలుగు తేజంతో రాజకీయ బంధుత్వం కలుపుకుంటోందా ? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది.. రాజ్‌భవన్‌లో పీవీ కుటుంబసభ్యులకు దేశ ప్రధాని నరేంద్రమోదీ విందు ఇవ్వడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

BJP on PV Family: తెలుగు తేజంతో రాజకీయ బంధుత్వం కలుపుకుంటోందా..? మరో పీవీ చుట్టూ రాజకీయం..
P V Narasimha Rao Family Members Meet Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: May 08, 2024 | 3:52 PM

Share

మన ఠీవీ పీవీని బీజేపీ ఓన్‌ చేసుకుంటోందా ? తెలుగు తేజంతో రాజకీయ బంధుత్వం కలుపుకుంటోందా ? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది..

దివంగత భారత ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు పేరు మరోసారి ప్రముఖంగా విన్పిస్తోంది. పీవీ నర్సింహారావు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతుందన్న వార్తలు పొలిటికల్‌ సర్కిళ్లలో విన్పిస్తున్నాయి. రాత్రి రాజ్‌భవన్‌లో పీవీ కుటుంబసభ్యులకు దేశ ప్రధాని నరేంద్రమోదీ విందు ఇవ్వడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కాంగ్రెస్‌కు నచ్చని తెలుగు ఠీవీని బీజేపీ ఓన్‌ చేసుకొనేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తలొస్తున్నాయి. పీవీతో బీజేపీ రాజకీయ బంధుత్వం కోరుకుంటోందని.. ప్రధాని విందు అందులో భాగమేనన్న చర్చ నడుస్తోంది.

ఇటీవల పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించింది మోదీ ప్రభుత్వం. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా పీవీకి పేరుంది. పీవీ సేవలకు గాను భారతరత్నతో గౌరవాన్ని ఇచ్చింది కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం. అయితే సొంత పార్టీ కాంగ్రెస్‌లో పీవీకి సరైన గుర్తింపు దక్కలేదన్న భావన చాలాకాలంగా ఉంది. సోనియాగాంధీకి పీవీ అంటే అయిష్టమని చెబుతుంటారు. ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియల విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహరించిన తీరును ఇప్పటికీ పలువురు గుర్తు చేస్తుంటారు. ఢిల్లీలో కాకుండా హైదరాబాద్‌లో పీవీ అంత్యక్రియలు జరిపారని, ఆయనను ఏనాడూ కాంగ్రెస్‌ గౌరవించలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి. ఇప్పటికీ ఢిల్లీలో పీవీ పేరిట స్మారకం కూడా నిర్మించలేదు. పీవీకి కాంగ్రెస్‌లో సరైన మర్యాద దక్కలేదని వాదిస్తోన్న బీజేపీ ఆయనను ఓన్‌ చేసుకునే పనిలో పడింది. పీవీ కుటుంబీకులకు విందుతో ప్రధాని మోదీ ఇచ్చిన సంకేతం ఇదేనన్న వాదన బలంగా విన్పిస్తోంది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించినందుకు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇక్కడి రాజ్‌భవన్‌లో మోదీని కలిసిన వారు దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వాణీదేవి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి నరసింహారావు అల్లుడు కేఆర్‌ నందన్‌, బీజేపీ నేత, మాజీ ప్రధాని మనవడు ఎన్‌వీ సుభాష్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించినందుకు మోదీకి రావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, ప్రయాణం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్స్, సనాతన ధర్మం, నేటి రాజకీయాలతో సహా పలు అంశాలపై మోదీ చర్చించినట్లు సమాచారం.

ఇక, తాజాగా వేములవాడ ఎన్నికల ప్రచార సభలోనూ ప్రధాని మోదీ మరోసారి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావును ఎంత నిర్లక్ష్యం చేసిందో వివరించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పటంలో పరుగులు పెట్టించిన ఘనత పీవీదే అంటూ కొనియాడారు. అంతటి మహోన్నతుడిని సొంత పార్టీ నేతలు విస్మరిస్తే, భారతీయ జనతా పార్టీ అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు. దేశంలో ప్రముఖులను గుర్తుంచుకోవాల్సి బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు ప్రధాని మోదీ. పీవీ కుటుంబసభ్యులతో విందు చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…