Nalgonda: నల్లగొండ జిల్లాలో అమానుష ఘటన.. తమ మాట వినలేదని కుల పెద్దలు ఏం చేశారంటే..!
Nalgonda: నల్లగొండ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న యుగంలో కూడా సామాజిక కట్టుబాట్లు..
Nalgonda: నల్లగొండ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న యుగంలో కూడా సామాజిక కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. పంచాయతీకి పిలిస్తే రాలేదని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు కుల, గ్రామ బహిష్కరణ చేశారు. బహిష్కరణకు గురైన కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, సహాయపడినా.. వారికి పది వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ మేరకు కుల బహిష్కరణపై కుల పెద్దలు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.
పూర్తి వివరాల్లోకెళితే.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం భైరవుని బండలో పులిగిల్ల అంజయ్య కుటుంబానికి.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో కుటుంబంతో కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ భూ వివాదం కుల పెద్దల వరకు చేరింది. ఈ భూ వివాదం పై మాట్లాడేందుకు ఈనెల 26వ తేదీన కులపెద్దలు ఇరు కుటుంబాలకు పంచాయతీకి రమ్మని సమాచారం అందించారు. కుల పెద్దల పిలుపును అంజయ్య కుటుంబం ఖాతరు చేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుల పెద్దలు.. తమ మాట వినకుండా కుల ధిక్కరణ చేశారంటూ అంజయ్య కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు.
అంజయ్య కుటుంబంతో తమ కులానికి చెందిన వ్యక్తులు మాట్లాడినా.. ఎలాంటి సహాయ సహకారాలు అందించినా.. వారికి పది వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ మేరకు కుల పెద్దలు ఒప్పంద పత్రం రాసుకొని ప్రచారం చేశారు. అయితే కుల పెద్దల ఆదేశాలను పట్టించుకోకుండా అంజయ్య వ్యవసాయ పనులకు వెళ్తుండగా గ్రామంలో తిరగవద్దని కుల పెద్దలు హెచ్చరించారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన అంజయ్య పోలీసులను ఆశ్రయించాడు. కుల పెద్దలు పులిగిల్ల పోచయ్య, పులిగిల్ల బిక్షమయ్య, నరిగే శంభయ్య, దుప్పల్లి నరేష్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Revanth Reddy: నేను సోనియాగాంధీ మనిషిని.. కాంగ్రెస్ బిడ్డను..ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు..