Independence Day: జెండా వందనంలో “అ”జెండా దండకం.. పంద్రాగస్టు వేదికల మీద పొలిటికల్ ప్రసంగాలు
జెండా ఊంఛా రహే హమారా. దేశమంతా మారుమోగిన సౌండ్ ఇది. అక్కడ ఎగిరింది తిరంగా జెండా ఐనా.. పొలిటీషియన్లు మాత్రం ఆ మూడు రంగుల్లో తమతమ జెండా రంగుల్ని చూసుకుని ఆస్వాదించారు. పాలక పక్షాలు అభివృద్ధి మంత్రం జపిస్తే ప్రతిపక్షాలు మాత్రం విమర్శల తంత్రం ప్రయోగించాయి. టోటల్‌గా స్వాతంత్ర్య దినోత్సవ వేదిక మీద సాగిన ప్రసంగాలన్నీ పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్టులుగా మారిపోయాయి.

అజాదీ 77.. మనకు స్వరాజ్యం ప్రాప్తించి డెబ్బయ్యేడేళ్లు. ఈ సందర్భంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుక… పక్కా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అసలే ఎలక్షన్ ఇయర్. మరో ఏడాదిలోగా అందరికీ ఓట్లు దండుకునే పండగ. అందుకే… దొరికిందే అదనుగా అవతలి పక్షాలకు తిరగమాత పెట్టేశారు అధికారపక్ష నేతలు. కాకపోతే సున్నితంగా, సుతారంగా… పార్టీల పేర్లు అస్సలు ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు.
దేశాన్ని దివాళా స్ధితి నుంచి ఆర్ధిక శక్తి దిశగా తీసుకెళ్తున్నాం, వందేళ్ళ ప్రణాళిక రూపొందిస్తున్నాం… ఈ సమయంలో జనం తప్పటడుగు వేస్తే.. దేశానికి అధోగతే అన్నారు మోదీ. కుటుంబ పాలనకు శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది వక్రీకరణలు, అబద్ధాలు, అతిశయోక్తులతో కూడిన ఫక్తు ఎన్నికల ప్రసంగం అని సర్టిఫై చేస్తూ ఆ తర్వాత మోదీ మీద రివర్స్ ఎటాక్ చేసింది ఆలిండియా కాంగ్రెస్ పార్టీ. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం… పంద్రాగస్టు పండగలో అదే తీరు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరేశారు
ఏపీ సీఎం జగన్. అభివృద్దిని- సంక్షేమాన్ని అడ్డుకునే వారిని అంటరానివాళ్ళుగా పరిగణించాలంటూ విపక్షాలకు తలంటేశారు. పేదవర్గాల్ని అణచివేస్తున్నవారిపై యుద్ధం చేస్తున్నామని, పెత్తందారీ భావజాలమున్నవారితో పోరాడుతున్నామని చెబుతూ.. R-5 జోన్ ఇళ్ళ నిర్మాణాన్ని అడ్డుకునే వారి గురించి ప్రస్తావించారు జగన్.
ఇచ్చిన హామీల్లో 95 శాతానికి పైగా నెరవేర్చామని చెప్పిన జగన్.. జనం దగ్గర వందకు వం మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశారు. మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అంటూ తన స్పీచ్ ద్వారా ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోబోయారు. పదవుల్లో కూడా బడుగువర్గాలకే పెద్దపీటలేశామని, ఐదు డిప్యూటీ సీఎం కుర్చీల్లో నాలుగింటిని వాళ్లకే ఇచ్చామని గుర్తు చేశారు.
ప్రతి రాజకీయ పార్టీ దేశభక్తితో మెలగాలని గుర్తు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. కొన్ని పార్టీలు కుళ్లు-కుతంత్రాలతో నిండిపోయాయని, దేశ సమగ్రతను సీఎం జగన్ కాపాడుతున్నారని సొంత పార్టీపై ప్రశంసలు జల్లుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం పంద్రాగస్టునాడు పాలిటిక్స్‌తో టచ్‌మీనాట్ అంటున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని, సిబ్బందికి మిఠాయిలు పంచారు చంద్రబాబు.
విజయవాడ బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు చైర్‌పర్సన్ పురంధేశ్వరి. జాతీయ జెండాను ఆవిష్కరించి రాజకీయ ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగించారు. వారాహి యాత్రలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్.. స్వతంత్ర దినోత్సవాన కూడా అధికార పార్టీని ఉపేక్షించలేదు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, జగన్ మీద ఎటాక్ షురూ చేశారు పవన్. 150 మంది పిల్లలను ట్రాఫికింగ్‌కు తరలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. సీఎం నివాసముండే తాడేపల్లిలోనే క్రైమ్ రేటు పెరిగిందన్నారు. ఒక తల్లి బాధ తీర్చలేనప్పుడు 151సీట్లు వచ్చి ఏంలాభమని ప్రశ్నించారు.
ఇటు… ఏపీ ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్‌లో సైతం గులాబీ కలర్ గుప్పుమంది. గుంటూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన తోట చంద్రశేఖర్, రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని అడిగే పార్టీయే లేదని మిగతా పార్టీల్ని టార్గెట్ చేశారు.
పంద్రాగస్టున కూడా వాడివేడిగా సాగాయి ఆంధ్రా పాలిటిక్స్. సెలవురోజు కూడా రాజకీయ నాయకులకు ఆటవిడుపు లేకుండా పోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం