Andhra – Telangana: ఏపీలో సజ్జల సౌండ్‌కి తెలంగాణాలో రీసౌండ్.. రెండు రాష్ట్రాల్లో మళ్లీ రాజుకున్న విభజన సెంటిమెంట్..
ఎనిమిదేళ్ల కిందటి జ్వాల మరోసారి భగ్గుమంది. రెండు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ మంటలు మళ్లీ రాజుకున్నాయి. ఇద్దరు సీఎంలూ ఒక్కటయ్యారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు.. సరికొత్త రాజకీయ అనుమానాల...
ఎనిమిదేళ్ల కిందటి జ్వాల మరోసారి భగ్గుమంది. రెండు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ మంటలు మళ్లీ రాజుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలూ ఒక్కటయ్యారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు.. సరికొత్త రాజకీయ అనుమానాలకు తావిస్తున్నాయి. ఇంతకూ ఇద్దరు సీఎంలూ ఒక్కటయ్యారా… అలా ఒక్కటవ్వడం వల్ల వచ్చే ప్రమాదాలేంటి… ప్రయోజనాలేంటి… ఇది టూస్టేట్స్‌లో వేడిపుట్టిస్తున్న టాపిక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంటు మంట సెగలు పుట్టిస్తోంది. విభజన జరిగి ఎనిమిదేళ్లయ్యాక ఇప్పుడు సమైక్య జ్వాల రాజుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటయ్యారు. తెలంగాణా సమాజం గమనించాలి సుమా అంటున్నారు టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరూ ఒక్కటే. దోచుకుందాం.. దాచుకుందాం అనేదే వీళ్ల పాలసీ. ఓడిపోతాం అనుకున్నప్పుడే జైఆంధ్రా, జై తెలంగాణ నినాదం అందుకుంటారట. ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో నోటిని బాగానే జాడించారు బండి.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆత్మరక్షణ కోసమే సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారా… జైఆంధ్రా, జై తెలంగాణా నినాదాల్ని సొంత రాజకీయాలకు వస్తువులుగా వాడుకుంటున్నారా..? నిజానికి ఇవి తీవ్రమైన ఆరోపణలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదగాలన్న కసితో పనిచేస్తున్న బీజేపీయులకు ఇదొక అందివచ్చిన అవకాశం కూడా. కానీ… విపక్షాల్లో ఇటువంటి అనుమానాలకు దారితీసిన పరిస్థితులు కూడా సాదాసీదా కాదు. రెండు రాష్ట్రాలూ మళ్లీ కలిసి ఒక్కటైతే సంతోషించేవాళ్లలో మేమే ఫస్ట్… మా ముఖ్యమంత్రి మనోభావం కూడా ఇదే అనేసిన సజ్జల… ఇటూఇటూ రెండువైపులా నిప్పు పెట్టారు. అవి యాదృచ్ఛికంగా అన్న మాటలు కాదనే వాదనలూ వినిపించాయి.
హక్కుల సాధనలో ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి చేసిన కామెంట్లకు కౌంటర్లివ్వబోతూ నోరు జారార్లే అని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ వాటి మీద క్లారిఫికేషన్లు రాకపోయేసరికి రియాక్షన్లు స్పీడందుకున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులూ తమతమ ప్రజల తరఫున నిలబడి సీరియస్‌గా పోరాడుతున్నారా అనే విషయాలను ప్రజలు లోతుగా గమనిస్తున్నారు. ఇదే గ్యాప్‌లో ఉమ్మడి ఆస్తుల విభజనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కారు. ఆ విధంగా విభజన జ్ఞాపకాల్ని మళ్లీ తవ్వుకున్నట్టయింది. ఇంకేముంది మంటలు రిపీటైనట్టే!
ఈ కొత్త పిటిషన్ ద్వారా కేసీఆర్‌తో యుద్ధం చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్పబోతోందా… లేక మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టబోతున్నారా… అనేవి అపోజిషన్ వాళ్ల డౌట్లు. రెండు పార్టీల మధ్య రాజకీయ ఒప్పందం కూడా కుదిరిందా అనేవి వైసీపీని ప్రశ్నలు వేధిస్తు్న్నాయి. తెలంగాణా సీఎంకు ఏపీ సీఎం ఒక్క లేఖ రాస్తేనో, ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటేనో పోయే దానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అగత్యం ఎందుకొచ్చింది.. అనేది ప్రధాన విమర్శ. ఆల్రెడీ ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఎనిమిదేళ్లుగా కంటిన్యూ అవుతూనే ఉంది. చెరోవైపు నిలబడి తెగేదాకా లాగుడే తప్ప… పరిష్కార మార్గం వెతికే మార్గం చూడటం లేదు.
హైదరాబాద్‌పై ఏపీకి పదేళ్ల పాటుండే హక్కునెలాగూ చేతులారా పోగొట్టుకుంది ఏపీ. 14 ఉమ్మడి ఆస్తుల మీద కేంద్ర హోంశాఖ కలుగజేసుకుని రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల్ని పిలిపించుకుని మాట్లాడినా నో యూజ్. జనాభా ప్రాతిపదికన పంచుకోవాలన్న సానుకూల పరిష్కారం కూడా వర్కవుట్ కాలేదు. ఈ పంచాయతీ కోసమే షీలా భిడే కమిటీ వేసినా… ఆ కమిటీ సిఫార్సుల్ని ఏ ఒక్క రాష్ట్రమూ గౌరవించడం లేదు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ప్రకారం ప్రభుత్వ సంస్థల్ని పంచుకోవడంపై రెండు రాష్ట్రాలూ ఎటూ తేల్చడం లేదు. లీగల్ ఒపీనియన్ తీసుకోవడం తప్ప మరో దిక్కు లేదని డిసైడైంది కేంద్ర హోంశాఖ.
సరిగ్గా ఇదే గ్యాప్‌లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్. కానీ ఇది సీరియస్ ఫైటే కాదని, రెండు రాష్ట్రాల జనాల్ని ప్రభావితం చేయడానికేనని బీజేపీ అంటోంది. ఫ్లాష్ బ్యాకుల్ని తవ్వుకోవడం ద్వారా మళ్లీ రాజుకున్న విభజన సెంటిమెంట్ ఎందాకా వెళుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..