నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు..! వారం రోజులు వానల్లేవ్..
Telangana Weather Alert: నైరుతి రుతుపవనాలు దేవ వ్యాప్తంగా విస్తరించినా పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజఫర్‌పుర్ వరకూ విస్తరించాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం..

హైదరాబాద్, జూన్ 18: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నప్పటికీ వాటి పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజఫర్‌పుర్ వరకు విస్తరించాయి. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.
అయితే రుతుపవనాల విస్తరణ కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 4 నుంచి జూన్ 17 మధ్య దేశవ్యాప్తంగా సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 40 శాతం లోటు ఏర్పడింది. ఈ పరిస్థితి ఖరీఫ్ సాగు పనులపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఈ సమయానికి దట్టమైన మేఘాలు కమ్ముకొని విస్తృతంగా వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆకాశంలో మేఘాలు కనిపించకపోవడంతో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కానరాని మబ్బులు.. వ్యవసాయ రాష్ట్రాల్లో కురవని వాన
ప్రస్తుతం అధిక శాతం మేఘాలు బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల పరిధిలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. వర్షపాత లోటు కారణంగా పలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గుజరాత్‌లో అత్యధికంగా 98 శాతం వర్షపాత లోటు నమోదుకాగా, మహారాష్ట్రలో 79 శాతం, ఝార్ఖండ్‌లో 66 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 65 శాతం, మేఘాలయలో 85 శాతం వర్షాల కొరత నమోదైంది. తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశా, బీహార్, అస్సాం రాష్ట్రాలు కూడా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో జూన్ నెలలో సాధారణంగా 130.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, బుధవారం నాటికి కేవలం 67.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో రైతులు విత్తనాలు వేసే విషయంలో సందిగ్ధంలో పడుతున్నారు. ఇక వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే.. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఖరీఫ్ సాగు కష్టమేనా?
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు రాబోయే రోజులు కీలకంగా మారనున్నాయి. రుతుపవనాలు వేగం పుంజుకుని సాధారణ వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు పనులు ఊపందుకునే అవకాశం ఉంది.
