Telangana Red Alert: రెడ్ అలర్ట్.. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
Telangana Heavy Rainfall: తెలంగాణలో వర్షాలే..వర్షాలు.. గత నాలుగైదు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణను భారీవర్షాలు వెంటాడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనంకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు జల దిగ్భంధంలోకి మగ్గుతున్నాయి. వరదలతో ముప్పు తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ తాజాగా మరో అలర్ట్ జారీ చేసింది. బుధవారంనాటికి తీవ్ర అల్ప పీడనంగా ఉన్న వాతావరణం ఇవాళ అల్పపీడనంగా బలహీనపడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాతోపాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద అల్పపీడనం అలాగే ఉందని తెలిపింది. ఈ అల్పపీడనానికితోడు మరో ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొంది.
ఆవర్తనంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 24 గంటలపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. అసాధారణమైన 24 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు తెలంగాణకు రెడ్ అలెర్ట్ ప్రకటిచింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గంటకు 40 నుంచి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం