Telangana RTC: ఆర్టీసీపై ప్యాసింజర్ పోరాటం.. టికెట్ డబ్బులతో సహా 10వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు
నగరంలోని మోతీనగర్ కు చెందిన కె. రమేష్ అనే వ్యక్తి.. 2020 ఆగష్టు 23న హైదరాబాద్ నుంచి పాల్వంచ వెళ్లడానికి రెండు వేర్వేరు బస్సుల్లో టికెట్స్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాడు.
Telangana RTC: ఈజీగా ప్రయాణం చేయడం కోసం ముందుగా బస్సు టికెట్స్ ను బుక్ చేసుకుంటాం. కానీ ఒకొక్కసారి మనకు ప్రయాణం చేయడానికి వీలుకాక టికెట్ ను రద్దు చేసుకుంటాం,. మరికొన్ని సార్లు అనుకోని కారణాల వలన బస్సు సర్వీస్ రద్దు అవుతుంది. అప్పుడు బుక్ చేసుకున్న ప్రయాణీకుల టికెట్లు కూడా ఆటోమేటిక్ గా రద్దు అవుతాయి. అయితే ఇలా బస్సు సర్వీస్ రద్దయితే.. టికెట్ బుక్ చేసుకున్న పాసింజర్ కు ఆ టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వలసిందేనని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
నగరంలోని మోతీనగర్ కు చెందిన కె. రమేష్ అనే వ్యక్తి.. 2020 ఆగష్టు 23న హైదరాబాద్ నుంచి పాల్వంచ వెళ్లడానికి రెండు వేర్వేరు బస్సుల్లో టికెట్స్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాడు. ఒకొక్క టికెట్ కు రూ. 469 చెల్లించాడు. అయితే ఆ రెండు బస్సు సర్వీసులు అనివార్య కారణాలతో రద్దు అయింది. దీంతో ఒక టికెట్ కు సంబంధించి ఆగష్టు 23న రూ. 468 లు తిరిగి రమేష్ కు ఇవ్వగా.. రెండో టికెట్ డబ్బులు రూ. 15 లు సెప్టెంబరు 30న రిఫండ్ అయింది. ఒక టికెట్ పై కేవలం తిరిగి రూ.15 లు మాత్రమే తిరిగి రావడంపై రమేష్ ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.
అప్పుడు ఆర్టీసీ అధికారులు.. బస్సు సర్వీస్ రద్దైతే.. 15 రోజుల్లోపు టికెట్ ను రద్దు చేసుకోవాలని.. అప్పుడే డబ్బులు తిరిగి వస్తాయని తెలిపారు. దీంతో రమేష్ తనకు రావాలిన డబ్బులు ఇప్పించమంటూ.. తెలంగాణ ఆర్టీసీ పై ఫిర్యాదు చేస్తూ.. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. రమేష్ ఫిర్యాదుపై కమిషన్ బెంచ్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఎస్.మాధవి విచారణ జరిపారు. తాజాగా ఈ విషయంపై తీర్పుని వెల్లడించారు. బస్సు సర్వీస్ రద్దు విషయంలో ప్యాసింజర్ కు సంబంధం లేదని.. సర్వీస్ రద్దు అయితే.. టికెట్ కూడా రద్దు అయినట్లే అని పేర్కొంది. దీంతో రమేష్ కు టికెట్ డబ్బులు రూ. 453 లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు కేసు నిమిత్తం రమేష్ పెట్టిన ఖర్చులకు గాను రూ. 10,000 లను చెల్లించాలని పేర్కొంది. ఇందుకు గానుఆర్టీసీకి 45 రోజుల గడువు ఇచ్చింది. గడువు లోపు రమేష్ కు డబ్బులు చెల్లించని పక్షంలో ఆ పదివేల రూపాయలకు 12శాతం వడ్డీ ఇవ్వాలని తీర్పునిచ్చింది హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..