AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రజలకు మరింత చేరువగా హైడ్రా సేవలు.. వెబ్‌సైట్‌లో ఎన్నో కీలక వివరాలు!

హైదరాబాద్ ప్రజలకు హైడ్రా సేవలు ఇప్పుడు కొత్త వెబ్‌సైట్ ద్వారా మరింత అందుబాటులోకి వచ్చాయి. విపత్తు నిర్వహణ, చెరువుల స్థితి, వర్షపాతం, ప్రభుత్వ భూముల వివరాలు ఈ పోర్టల్‌లో లభిస్తాయి. భూములు, నిర్మాణాలపై నిర్ణయాలకు కీలక సమాచారం, 24 గంటల హెల్ప్‌లైన్, ఫైర్ సేఫ్టీ NOC ఆన్‌లైన్ దరఖాస్తు వంటి సౌకర్యాలున్నాయి. పారదర్శకత పెంచడమే లక్ష్యం.

Hyderabad: ప్రజలకు మరింత చేరువగా హైడ్రా సేవలు.. వెబ్‌సైట్‌లో ఎన్నో కీలక వివరాలు!
Hydra Commissioner Ranganath
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 8:26 PM

Share

హైదరాబాద్‌ నగర ప్రజలకు హైడ్రా సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వచ్చాయి. విపత్తు నిర్వహణ, చెరువుల పరిరక్షణ, వర్షాలు, వరదలు, ప్రభుత్వ భూములు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు హైడ్రా కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.

కొత్త వెబ్‌సైట్‌ ద్వారా హైడ్రా చేపడుతున్న కార్యకలాపాలతో పాటు నగరంలోని చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములు, వరద ప్రభావిత ప్రాంతాలు, వర్షపాతం వంటి వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చెరువుల పరిధి, ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL), బఫర్‌ జోన్‌ తదితర సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే పరిశీలించుకునే అవకాశం కల్పించారు. దీంతో భూములు, నిర్మాణాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందుబాటులోకి రానుంది.

భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు వాతావరణ వివరాలు, రైన్‌ఫాల్‌ మ్యాప్స్‌, డాప్లర్‌ రాడార్‌ సమాచారం కూడా పోర్టల్‌లో పొందుపరిచారు. నీరు నిలిచే ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను మ్యాప్స్‌ ద్వారా గుర్తించుకునే సదుపాయం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే హైడ్రాకు సమాచారం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్‌ ‘1070’ ను ఏర్పాటు చేశారు. చెట్లు కూలడం, వరదలు, రోడ్లపై నీరు నిలవడం, అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చు.

అదే విధంగా ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు స్థితిని కూడా ఆన్‌లైన్‌లోనే ట్రాక్‌ చేసుకోవచ్చు. హెచ్‌ఎండీఏ లేక్స్‌ పోర్టల్‌, తెలంగాణ భూ భారతి పోర్టల్‌లకు నేరుగా వెళ్లేందుకు వెబ్‌సైట్‌లో లింకులు ఇచ్చారు. హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణ పనులు, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఫొటోలు, వీడియోలను కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తంగా కొత్త వెబ్‌సైట్‌ ద్వారా హైడ్రా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, చెరువులు, భూములు, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us