AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు వారాలైనా దొరకని ఆచూకీ.. నేపాల్ వరదల్లో 77 మంది గల్లంతుపై ఈషా ఫౌండేషన్ కీలక ప్రకటన

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన పెను జలప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరదలు విరుచుకుపడి రెండు వారాలు గడిచినా.. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన భక్తుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. 77 మంది యాత్రికులు, ముగ్గురు వాలంటీర్ల పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, ఈషా ఫౌండేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది.

రెండు వారాలైనా దొరకని ఆచూకీ.. నేపాల్ వరదల్లో 77 మంది గల్లంతుపై ఈషా ఫౌండేషన్ కీలక ప్రకటన
Isha Foundation Issues Key Statement
Krishna S
|

Updated on: Sep 12, 2026 | 7:52 PM

Share

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తి రెండు వారాలు గడిచినా ఇంకా గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన 77 మంది యాత్రికులు, ముగ్గురు వాలంటీర్లు ఇప్పటికీ ఆచూకీ లేకుండానే ఉన్నారని ఈషా ఫౌండేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బాధితుల కుటుంబాలకు సహాయం అందించడమే ప్రస్తుతం తమ ప్రధాన ప్రాధాన్యత అని సంస్థ స్పష్టం చేసింది.

19 దేశాల ఎంబసీలతో సమన్వయం

గల్లంతైన వారిని గుర్తించేందుకు భారత్, చైనా, నేపాల్ ప్రభుత్వాలతో పాటు 19 దేశాల ఎంబసీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్, గ్లోబల్ అఫైర్స్ కెనడా వంటి అంతర్జాతీయ ఏజెన్సీలతో కూడా సహాయం తీసుకుంటున్నారు. రెస్క్యూ బృందాలు, అధికారిక ఏజెన్సీలకు బాధితుల వివరాలు, ఫోటోలు, గుర్తింపు కార్డులను ఇప్పటికే అందజేశారు. బాధితుల గోప్యతను కాపాడే ఉద్దేశంతో పేర్లు, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయబోమని స్పష్టం చేసింది.

ప్రమాద స్థలంలో ఆంక్షలు.. కఠిన పరిస్థితులు

చైనా వైపు ఉన్న గైరోంగ్ పోర్ట్ వద్ద సహాయక చర్యలు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నందున ఆ ప్రాంతాన్ని చైనా అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అక్కడికి అనుమతి నిరాకరించారు. నేపాల్ వైపు కూడా స్థానిక యంత్రాంగం రాకపోకలను కట్టడి చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న కఠినమైన పరిస్థితుల దృష్ట్యా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావడానికి గణనీయమైన సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నేపాల్‌లో గ్రౌండ్ లెవల్ ఆపరేషన్స్

పరిస్థితిని పర్యవేక్షించేందుకు నేపాల్‌లో స్థానిక భాష మాట్లాడగలిగే 25 మంది వాలంటీర్లతో కూడిన బృందాన్ని ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఆసుపత్రులు, మార్చురీలను సందర్శించి రికార్డులను పరిశీలిస్తున్నారు. అలాగే గుర్తింపు ప్రక్రియ కోసం డీఎన్‌ఏ కేంద్రాలను సంప్రదించి, ఆయా దేశాల రాయబార కార్యాలయాల ద్వారా వివరాలు అందిస్తున్నారు. నేపాల్ పోలీస్, టూరిస్ట్ పోలీస్, నేపాల్ ఆర్మీ రెస్క్యూ టీమ్‌లకు పూర్తిస్థాయి డేటాను అందించి గాలింపు చర్యలను విస్తరించారు. యాత్రికులు ఖాట్మండులో వదిలివెళ్లిన లగేజీ, వస్తువులను స్థానిక టూర్ ఆపరేటర్లు, డీహెచ్ఎల్ కొరియర్ సహకారంతో వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

8 దేశాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు

బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు 8 దేశాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు, ఈమెయిల్ హెల్ప్‌లైన్‌ను ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. వాలంటీర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్లలో అలుపెరగకుండా శ్రమిస్తున్న చైనా, భారత్, నేపాల్ సైన్యం, పోలీసులు, విదేశాంగ అధికారులకు సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Follow Us