AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: మోదీ ఫొటో.. జిన్‌పింగ్‌కు గిఫ్ట్ అంటూ ప్రచారం..! అసలు నిజం ఇదే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోదీ-జిన్‌పింగ్‌ బహుమతి వీడియో తప్పుదోవ పట్టించేది. ప్రధాని మోదీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటం ఇవ్వలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇది 2019 మామల్లపురం నాటి వీడియో, అప్పుడు జిన్‌పింగ్‌ మోదీకి బహుమతి ఇచ్చారు.

Fact Check: మోదీ ఫొటో.. జిన్‌పింగ్‌కు గిఫ్ట్ అంటూ ప్రచారం..! అసలు నిజం ఇదే!
Pm Modi Xi Jinping Gift Video Fact Check
Balaraju Goud
|

Updated on: Sep 12, 2026 | 8:01 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోదీ-జిన్‌పింగ్‌ బహుమతి వీడియో తప్పుదోవ పట్టించేది. ప్రధాని మోదీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటం ఇవ్వలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇది 2019 మామల్లపురం నాటి వీడియో, అప్పుడు జిన్‌పింగ్‌ మోదీకి బహుమతి ఇచ్చారు. ప్రస్తుత బ్రిక్స్ సదస్సుతో ముడిపెడుతూ జరుగుతున్న ఈ ప్రచారం అవాస్తవం, సమాచారం ధృవీకరణ అవశ్యకతను గుర్తుచేస్తుంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తన చిత్రపటాన్నే కానుకగా ఇచ్చారంటూ ఈ వీడియోను పలువురు షేర్‌ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది.

2019 నాటి వీడియో.. ఇప్పుడు వైరల్!

ప్రధాని మోదీ స్వయంగా జిన్‌పింగ్‌కు తన చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారన్న వాదనలో నిజం లేదని PIB ఫ్యాక్ట్‌చెక్‌ వెల్లడించింది. వైరల్‌ అవుతున్న వీడియో 2019 నాటిదని తెలిపింది. 2019 అక్టోబర్‌ 12న తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన మోదీ-జిన్‌పింగ్‌ భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడు ప్రధానికి మోదీ చిత్రంతో కూడిన పింగాణీ జ్ఞాపికను బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. అంటే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పూర్తి భిన్నంగా, చిత్రపటం మోదీ నుంచి జిన్‌పింగ్‌కు వెళ్లలేదు.. జిన్‌పింగ్‌ నుంచే మోదీకి వచ్చింది అన్నమాట. పాత వీడియోను ప్రస్తుత బ్రిక్స్‌ సదస్సుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని PIB పేర్కొంది.

ఏడేళ్ల తర్వాత భారత్‌లో జిన్‌పింగ్‌

ఇదిలా ఉంటే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారం (సెప్టెంబర్ 12) న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద ఆయనకు ఘన స్వాగతం పలికారు.

2020లో జరిగిన గల్వాన్‌ ఘర్షణల తర్వాత భారత్‌-చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయిలో అనేక చర్చలు జరిగాయి. 2024లో సరిహద్దు ప్రాంతాల్లో డిస్ఎంగేజ్‌మెంట్‌ తర్వాత సంబంధాలను క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మోదీ-జిన్‌పింగ్‌ భేటీపై భారీ అంచనాలు

బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమావేశం ఇరు దేశాల సంబంధాల విషయంలో కీలకంగా మారింది. సరిహద్దు సమస్య, వాణిజ్యం, పెట్టుబడులు, మార్కెట్‌ యాక్సెస్‌ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనాలు వ్యక్తమయ్యాయి.

ఇక భారత్‌-చైనా సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు ఇటీవలి కాలంలో కనిపిస్తున్నాయి. విమాన సర్వీసుల పునరుద్ధరణ, వీసా ప్రక్రియల్లో మార్పులు, ఉన్నతస్థాయి దౌత్య చర్చలు ఈ పరిణామాలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి.

బ్రిక్స్‌లో చైనా సందేశం

మరోవైపు, న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ప్రపంచంలోని కీలక పరిణామాలపై చర్చ జరుగుతోంది. మధ్యప్రాచ్య సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ వాణిజ్యం, ఏకపక్ష ఆంక్షలు వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. బ్రిక్స్‌ వేదికగా చైనా, రష్యా సహా కొన్ని దేశాలు పాశ్చాత్య ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాయి. భారత్‌ మాత్రం బ్రిక్స్‌ను ఏ దేశానికీ వ్యతిరేక వేదికగా మార్చకుండా, గ్లోబల్‌ సౌత్‌ ప్రయోజనాలకు ఉపయోగపడే వేదికగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది.

ఈ నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్‌ భేటీకి అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇదే సమయంలో పాత వీడియోను ప్రస్తుత ఘటనగా చూపిస్తూ జరుగుతున్న తప్పుడు ప్రచారం మరోసారి సోషల్‌ మీడియా సమాచారాన్ని ధృవీకరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us