Hyderabad: అప్సర హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, రూ.10లక్షల జరిమానా!
సరూర్‌నగర్ పరిధిలో జరిగిన యువతి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అప్సర అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ప్రధాన నిందితుడు పూజారికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.

హైదరాబాద్ మహానగరంలోని సరూర్‌నగర్ పరిధిలో జరిగిన యువతి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అప్సర అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ప్రధాన నిందితుడు పూజారికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.
తమిళనాడుకు చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసింది. నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పలు తమిళ చిత్రాల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం 2022 ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌కు వచ్చింది. తల్లితో కలిసి సరూర్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేది. దైవభక్తి కలిగిన అప్సర తరచూ దేవాలయానికి వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది.
అప్సరతో పూజారి సాయికృష్ణ నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో నాలుగుసార్లు హత్యకు ప్లాన్ చేశాడు. చివరికి 2023, జూన్‌లో శంషాబాద్ ప్రాంతంలో అప్సరను హత్య చేసి.. సరూర్‌నగర్‌లోని మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో మృతదేహాన్ని పడేశాడు. వాసన వస్తున్నట్టు గమనించి రెండు ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించి దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా మూసేశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.
అప్సర హత్య కేసులో సాయికృష్ణను దోషిగా నిర్దారిస్తూ జీవిత ఖైదు శిక్ష విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఓ హత్య కేసులో 10లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించడం ఇదే మొదటిసారని న్యాయవాది అన్నారు. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈ సంచలన తీర్పుతో తన బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుందని అప్సర తండ్రి అన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..