Hyderabad: మొన్న నిజామాబాద్.. నేడు హైదరాబాద్..వణుకు పుట్టిస్తున్న వరస పేలుడు ఘటనలు..

హైదరాబాద్‌ మళ్లీ ఉలిక్కిపడింది. డంపింగ్‌యార్డులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకీ పేలుడుకు కారణాలేంటి?.. లోయర్‌ ట్యాంక్...

Hyderabad: మొన్న నిజామాబాద్.. నేడు హైదరాబాద్..వణుకు పుట్టిస్తున్న వరస పేలుడు ఘటనలు..
Blst In Hyderabad
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 16, 2022 | 8:10 AM

హైదరాబాద్‌ మళ్లీ ఉలిక్కిపడింది. డంపింగ్‌యార్డులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకీ పేలుడుకు కారణాలేంటి?.. లోయర్‌ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో చెత్త ఏరుకునే తండ్రీ కొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. డంపింగ్ యార్డులో ఒక్కసారి భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏమైందో తెలుసుకునేందుకు వెళ్లిన స్థానికులకు ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడిఉన్న దృశ్యం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు తండ్రీకొడుకులిద్దర్నీ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.పేలుడు జరిగిన స్థలాన్ని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్‌ సీఐ మోహన్‌రావు పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. పేలుడు జరిగిన డబ్బాను పరిశీలించారు.

పెయింటింగ్‌లో కలిపే కెమికల్‌ టిన్నర్‌బాక్స్‌ను ఓపెన్‌ చేస్తుండగా పేలుడు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కర్నూలు జిల్లాకు చెందిన చంద్రన్న, ఆయన భార్య, కుమారుడు సురేష్‌ చెత్త కోసం స్నో వరల్డ్‌ పక్కనున్న డంపింగ్‌యార్డుకి వెళ్లారు. చంద్రన్న, ఆయన కుమారుడు ఇద్దరు సీల్‌ ఉన్న కెమికల్‌ టిన్నర్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేస్తుండగా, కెమికల్‌ రియాక్షన్‌ జరిగి, ఒక్కసారిగా పేలుడు జరిగిందని స్థానికులు తెలిపారు. డంపింగ్‌ యార్డుకు జీహెచ్‌ఎంసీ వాహనాలు కాకుండా, ఇతర ప్రైవేట్‌ వాహనాలు వచ్చి కెమికల్‌ డబ్బాలు పడేసి వెళ్లిపోతున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు.

ఐదు రోజుల క్రితం నిజామాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పెద్దబజార్‌లో జరిగిన పేలుడు కలకలం రేపింది. చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి.. చెత్తలోంచి ఓ బాటిల్‌ను తన సంచిలో వేసుకుని రోడ్డుపైకి వచ్చాడు. ఓ మద్యం దుకాణం దగ్గరకు రాగానే బాటిల్‌ బ్లాస్ట్‌ అయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఏంటీ బాటిల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెత్తలో ఎందుకు పారేస్తున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌ పేలుడు ఘటనలో గాయపడ్డ తండ్రీకొడుకులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కొడుకు సురేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..