Antibiotics: ఎడాపెడా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారా.! అయితే మీకోసం ఆస్పత్రి బెడ్డు రెడీగా ఉన్నట్టే..
జబ్బు వచ్చింది కదా అని.. ఏది పడితే ఆ యాంటీ బయోటిక్స్ వాడేస్తున్నారా.? సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీ బయోటిక్స్ వాడితే లేనిపోని రోగాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి ఇక్కడ.

యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా, డాక్టర్ సూచనలేకుండా వాడుతున్నారా? ఇది అత్యంత ప్రమాదకరమని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో హెచ్చరించారు. యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లకే చికిత్స చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ఐసీయూలో చేరుతున్న అనేక మంది రోగులు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారనీ అన్నారు. అంటే ఏ యాంటీబయాటిక్ కూడా పనిచేయని స్థితి. దీనికి ప్రధాన కారణం యాంటీబయాటిక్స్‌ను ఎడాపెడా వాడటమే అని తెలిపారు.
జ్వరం, దగ్గు, విరేచనాలు, కడుపునొప్పి, మూత్రం పోస్తే మంట వంటి సమస్యలు వచ్చిన వెంటనే స్వయంగా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని, తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా స్వయం మందులు వద్దు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే యాంటీబయాటిక్స్ వాడాలి” అన్నారు. నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా ఇదే అన్నారు. యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం వల్లే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ ప్రతి ఏడాది లక్షలాది ప్రాణాలను కాపాడుతున్నాయి. కానీ అవసరం లేని సందర్భాల్లో వాడితే ప్రమాదకరంగా మారతాయనీ చెప్పారు. యాంటీబయాటిక్స్ ప్రాణాంతక ఇన్ఫెక్షన్లపై పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. డాక్టర్లు కూడా బాధ్యతగా ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం మాత్రమే యాంటీబయాటిక్స్ సూచించాలని అన్నారు. మొత్తానికి యాంటీబయాటిక్స్‌ను సరైన సమయంలో, సరైన మోతాదులో, డాక్టర్ సూచనలతో మాత్రమే వాడితేనే అవి ప్రాణాలను కాపాడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో సాధారణ ఇన్ఫెక్షన్లకే చికిత్స దొరకని ప్రమాదం ఉందని స్పష్టం చేసారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
