Winter Heart Health: చలికాలంలో గుండెపోటు ప్రమాదం.. ముందుగానే ఈ టెస్ట్‌లు చేయించుకోండి
శీతాకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేసవితో పోలిస్తే గుండెపోటు కేసులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా చల్లని వాతావరణంలో రక్త నాళాలు కుంచించుకుపోయి, గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాలలో, ప్రారంభ దశలోనే గుండె సమస్యలను సులభంగా గుర్తించడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు..

శీతాకాలంలో కొన్ని అవసరమైన గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు గుండెపోటు కేసులను కూడా సకాలంలో తగ్గించవచ్చు. ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వరుణ్ బన్సాల్ శీతాకాలంలో తప్పకుండా చేయవలసిన కొన్ని పరీక్షల గురించి చెబుతున్నారు. కాబట్టి శీతాకాలంలో చేయించుకోవలసిన పరీక్షలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష
ఈ పరీక్ష శరీరంలోని లిపిడ్ల స్థాయిలను కొలుస్తుంది. ఇది LDL (చెడు కొలెస్ట్రాల్), HDL (మంచి కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్లను కొలుస్తుంది. ఈ స్థాయిలు శరీరంలో సాధారణ పరిధి కంటే ఎక్కువగా ఉంటే గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థం.
బిపి పరీక్ష
ఈ పరీక్ష గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎంత ఒత్తిడిని ఉపయోగిస్తుందో చూపిస్తుంది. శీతాకాలంలో గుండె నాళాలు కుంచించుకుపోతాయి. కాబట్టి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. అధిక రక్తపోటు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోవాలి.
ఈసీజీ
ఈ పరీక్ష హృదయ స్పందన రేటు, గుండె కండరాల బలం, గుండె సంబంధిత సమస్యలను వెల్లడిస్తుంది. ఎవరికైనా తరచుగా ఛాతీ నొప్పి వస్తుంటే, వారు ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోవాలి.
గుండెపోటు ఎప్పుడు ఎక్కువగా వస్తుంది?
శీతాకాలంలో గుండెపోటు కేసులు పెరుగుతాయని డాక్టర్ బన్సాల్ అంటున్నారు. ముఖ్యంగా ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉదయం ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటుంది. ఇది గుండె నాళాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా గుండెపోటుకు దారితీస్తుంది. దీనిని నివారించడానికి ఈ మూడు పరీక్షలు చేయాలి. వీటిలో ఏదైనా సమస్య కనిపిస్తే దాని ఆధారంగా వైద్యులు ఇతర పరీక్షలు చేస్తారు.
ఈ పరీక్షలు ఎవరికి అవసరమంటే?
- 45 ఏళ్లు పైబడిన వారు
- అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు
- ఇప్పటికే ఏదో ఒక రకమైన గుండె జబ్బు ఉన్నవారు
- అతిగా ధూమపానం చేసేవారు
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




