Telangana: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్టి నుంచే.. పూర్తి వివరాలు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన 'మహాలక్ష్మీ' పథకం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా మహిళందరూ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయొచ్చునని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మీ’ పథకం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా మహిళందరూ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయొచ్చునని అధికారులు తెలిపారు. తెలంగాణ పరిధి వరకు మహిళలతోపాటు బాలికలు, ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలకు ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని.. తెలంగాణ పరిధి దాటి ప్రయాణిస్తే మాత్రం టారిఫ్ ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తారని చెప్పారు. రేపట్నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ ఆవరణలో జెండా ఊపి ఈ ‘మహాలక్ష్మీ’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం రీ-యింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తుంది. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. భాగ్యనగరంలో సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. ఆధార్ లాంటి ఏదో ఒక ఐడీ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడెంటీ కార్డులు అవసరం లేదన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆ తర్వాత ‘మహాలక్ష్మి స్మార్ట్‌కార్డ్’ జారీ కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తామన్నారు. 7290 బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చునని.. అవసరమైతే సర్వీసులు పెంచుతామని అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
-
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచితం ప్రయాణం వర్తింపు
-
తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు
-
స్థానిక దృవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి
-
కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు
-
ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేస్తారు
-
అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తింపు

