Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు
ఇఫ్తార్ విందు సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ (ఏప్రిల్ 12) ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ విందులో సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అలాగే పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం చుట్టపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇఫ్తార్ విందు సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక ట్రాఫిక్ మళ్లింపుల్లో భాగంగా చాపెల్ రోడ్, నాంపల్లి నుంచి పీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద పీసీఆర్ వైపు మళ్లించనున్నారు.
వాహనాల మళ్లింపులు ఇలా..
- ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి బషీర్‌బాబ్ ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ప్లై ఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు.
- రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి పీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను ఫతే మైదాన్‌లోని కేఎల్‌కే బిల్డింగ్ వద్ద సుజాత హైస్కూల్ వైపు మళ్లించనున్నారు.
- బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే ట్రాఫిక్‌ను పీజేఆర్ విగ్రహం వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ వాహనాలు ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వరకు వెళ్లి చాపెల్ రోడ్డు వైపు కుడి మలుపు తీసుకోవాల్సి ఉంటుంది.
- నారాయణగూడ శ్మశానవాటిక వైపు నుంచి వచ్చే వాహనదారులను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్‌నగర్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
- కింగ్‌కోటి, బొగ్గుల కుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలను కింగ్‌కోటి కూడలి వద్ద తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్ వైపు మళ్లించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..