Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు, నలుగురి బ్యాంక్ ఖాతాల నుండి విదేశాలకు భారీగా డబ్బు..!
డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇవాళ కెల్విన్, కుధూస్ లను ఈడీ అధికారులు 7 గంటలుగా విచారిస్తున్నారు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో 30
Tollywood Drugs Case: డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇవాళ కెల్విన్, కుధూస్ లను ఈడీ అధికారులు 7 గంటలుగా విచారిస్తున్నారు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్ధూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ ఖాతాల నుండి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్టు ఆధారాలు ఈడీ అధికారులకు లభించాయి. సినీ తారల బ్యాంక్ ఖాతాల నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీశాన్‌ల ఖాతాలకు మధ్య లావాదేవీలు జరిగినట్టు కూడా తేలింది. వీటి ఆధారంగా డ్రగ్స్ కేస్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు. ఇవాళ కెల్విన్‌తో పాటు కుధూస్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన నందుతో పాటు మిగిలిన 8మంది నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు కేసు మూలాలు తోడుతోంది ఈడీ. ఇందుకోసం కీలక సూత్రధారిని తమ అదుపులోకి తీసుకుంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన నందుని 5 గంటలుగా విచారిస్తూనే మధ్యలో కెల్విన్‌ని ఈడీ ఆఫీస్‌కి రప్పించి అరెస్ట్ చేశారు.
సినీతారల డ్రగ్స్ కేసులో అసలు డొంక కదిలించడానికి ఈడీ అధికారులు మళ్లీ మొదటికి వచ్చారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్‌ను భారీ భద్రత మధ్య ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అల్రెడీ నటుడు నందుని ఉదయం నుంచే విచారిస్తుండగానే కెల్విన్‌ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంతకు ముందు నందు బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. అనుమానాస్పద లావాదేవీలపై ఇద్దరిని ఎదురెదురుగా కూర్చొబెట్టి విచారించారు. ఈడీ విచారణకు హాజరైన కెల్విన్‌తో పాటు అతని స్నేహితులు కుదూస్, వాహిద్‌లను కూడా విచారిస్తున్నారు. కెల్విన్ బ్యాంక్ డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈడీ నోటీసులు పంపిన వాళ్లతో పాటు ఇంకా ఎవరెవరు సినీ ప్రముఖులతో కెల్విన్‌కి సంబంధాలు ఉన్నాయి ? కెల్విన్ బ్యాంక్ లావాదేవీలపై కూడా ఆరా తీశారు.
ఇక ఈ ఎపిసోడ్‌లో హీరో రానాను విచారించే 24 గంటల ముందే.. కెల్విన్ స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. దానికి అనుగూణంగానే రానాపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈడీ వీళ్లందరినీ విచారించడానికి ఉన్న ఆధారం కెల్విన్ కాల్ డేటా, అతని బ్యాంక్ స్టేట్‌మెంట్లు. అతనితో ట్రాన్జాక్షన్స్ నిర్వహించిన సినీ ప్రముఖులందరి డేటానూ పరిశీలిస్తోంది ఈడీ. అందుకే ఇంటారేగషన్‌కు పిలిచే ప్రతీ వ్యక్తితో పాటు బ్యాంక్ లావాదేవీల చిట్టా తీసుకురమ్మని ఆదేశించింది. కెల్విన్ అతని స్నేహితులను ముగ్గురిని తమ ఆధీనంలో ఉంచుకొనే మిగిలిన వాళ్లను విచారించనుంది ఈడీ.