KTR: దక్షిణాసియాలో ఒక కెనేడియన్ సంస్థ లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి: కేటీఆర్
తెలంగాణకు అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కెనడాకు చెందిన ఇవాన్..
Canadian company investment : తెలంగాణకు అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. జీనోమ్ వ్యాలీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ల్యాబ్ స్పేస్‌లో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో సంస్థ ఇండియా ఎండీ చాణక్య చక్రవర్తి, సంస్థ సీనియర్ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హా ఈ మేరకు సమావేశమయ్యారు.
కెనడా సంస్థ జీనోమ్ వ్యాలీలోని ఎంయన్ పార్క్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు మంత్రికి తెలిపింది. కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారాయన.
ఇలా ఉండగా, కెనడా సంస్థ పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగంలో అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయి. జీనోమ్ వ్యాలీలో లాబొరేటరీ స్పేస్ మరింత పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి, అనుబంధ రంగాల మౌలిక వసతులు రానున్న కాలంలో మరింతగా పెరగనున్నాయి.