పాలిటిక్స్ టూ మూవీస్.. పార్ట్‌టైమ్ నటులుగా మారిన ఫుల్‌టైమ్ పొలిటీషియన్స్.. వారెవరంటే.?
నార్మల్‌గా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తుంటారు. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు...పొలిటీషియన్లుగా మారుతుండడం మనం చూస్తుంటాం. కానీ ఫుల్ టైమ్ పొలిటీషియన్స్.. పార్ట్ టైమ్ నటులుగా మారితే ఎట్లా ఉంటుందో తెలుసా? అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ వివరాలు ఇలా

తెలంగాణ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వ్యక్తి తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు రాజకీయాలంటే బోర్ కొట్టిందో…లేక ఓ బ్రేక్ తీసుకోవాలనుకున్నారో తెలియదు కానీ, ముఖానికి మేకప్ వేసుకుని సినిమాల్లో నటించనున్నారు. తన పేరుతోనే “జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్” టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. అదొక ప్రేమ కథా చిత్రమని, అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని వెల్లడించారు. మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానన్నారు. వచ్చే ఉగాది నాటికి సినిమా పూర్తి చేస్తామన్నారు జగ్గారెడ్డి. రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని ఈ సినిమాలో నటిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. తన నిజ జీవితంలో పాత్రనే సినిమాలో పోషిస్తున్నానంటున్నారు జగ్గారెడ్డి. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమా నిర్మాణం పూర్తి చేసి దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో మరో నేత కూడా ముఖానికి రంగేసుకున్నారు. పొలిటికల్ స్క్రీన్ పైనే కాదు…సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరిశారు. ఆయనే ఎమ్మెల్సీ కాబోతున్న అద్దంకి దయాకర్. ఆయన కూడా పాన్ ఇండియా సినిమాతో గ్రాండ్ ఎంట్రీకి తహతహలాడుతున్నారు. 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు..ఇండియా ఫైల్స్. ఈ సినిమాలో అద్దంకి దయాకర్ సరసన.. ప్రముఖ నటి ఇంద్రజ నటిస్తున్నారు. గతంలో ఎంపీగా, గవర్నర్‌గా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కూడా సినిమాల్లో నటించారు. కలెక్టర్ గారు మూవీలో ఆయన ముఖ్యమంత్రి పాత్ర పోషించారు.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేత, ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడే అంబటి రాంబాబు కూడా సినిమాల్లో నటించారంటే మీరు నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. అలనాటి అందాల నటి మాధవితో ఆయనతో నటించిన సినిమా పోస్టర్‌నే మీరు చూస్తున్నారు. ఆయన బాగా యంగ్‌గా ఉన్నప్పుడు సినిమాల్లో నటించారు. ఇక వైసీపీకి చెందిన మరో నేత..కరణం ధర్మశ్రీ కూడా సినిమాల్లో నటించారు. ఆయనలో కళా పిపాస కొద్దిగా ఎక్కువే! సినిమాలతో పాటు నాటకాల్లో కూడా పాత్రలను పోషించారు. 2009లో ఆయన నటించిన తొలి సినిమాకే బంగారు నంది అవార్డు దక్కించుకున్న ఘనత సాధించారు. ఒడిశా గిరిజన తండాలోని ఓ బాలిక యధార్థగాథపై తీసిన ‘దుర్గి’ బాలల చిత్రంలో బాలికకు తండ్రిగా అప్పన్న పాత్రలో ధర్మశ్రీ కీలకపాత్ర పోషించారు. మెుదటిసారిగా వెండి తెరపై ఆయన కనిపించి.. పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అందరి మన్ననలు పొందారు. ఆ తర్వాత జై మోదకొండమ్మ అనే సినిమాలో ఆయన నటించారు.
అలాగే వైసీపీ యువ నేత, మాజీ ఎంపీ, మార్గాని భరత్ సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. 2017లో వచ్చిన ఓయ్ నిన్నే మూవీలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. టీడీపీ నేత, గతంలో ఎంపీగా పనిచేసిన నారమల్లి శివప్రసాద్ పలు సినిమాల్లో నటించారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా – స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. 2006లో విడుదలైన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నారు. ఆయన 2019లో మృతి చెందారు.