Hyderabad: ఆ వెహికిల్స్ అన్నీ గ్యారేజ్‌లోకి తోలాల్సిందే.. బండి వయసు ఎన్నేళ్లు దాటితే షెడ్డులోకి తోయాలి…?
పాత సామానులు కొంటాం...మరీ పాతపడిపోయింది..ఇప్పుడు పాత వాహనాలను కొంటాం..అన్న మాట కొత్తగా వినబడుతోంది. మీరు నడుపుతున్న బండి లేటెస్ట్ అయితే ఓకే..మరీ ఓల్డ్ అయితే మాత్రం ఓల్డేజ్ హోమ్‌లోకి..అదేనండి గ్యారేజ్‌లోకి తోలాల్సిందే. తుక్కుకింద అమ్ముకోవాల్సిందేనంటున్నాయి కొత్త చట్టాలు..రాబోయే పాలసీలు. మన తెలంగాణలో కూడా బండి బాగున్నా..దాని డేట్ ఎక్స్ప్‌యిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట. ఇంతకూ బండి వయసు ఎన్నేళ్లు దాటితే షెడ్డులోకి తోయాలి...? కొత్త చట్టం వాహనదారులకు కొత్త చిక్కులు తెస్తుందా..? అసలెందుకీ పాలసీలను మన పాలకులు తెస్తున్నారు..? ఢిల్లీ దుస్తితిని చూసి భయపడ్డారా....?
ప్రస్తుతం నగరాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య..కాలుష్యం. అందులో మొదటిది వాయుకాలుష్యం. ఢిల్లీలో చూస్తున్నాంగా..అక్కడ తినే తిండే, తాగే నీరు, పీల్చేగాలి ఇలా ప్రతిదీ కలుషితమే. ఇలాంటి పరిస్థితి..దుస్థితి తమ నగరాలకు రాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలోనూ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెహికిల్ 15 ఏళ్లు పైబడితే..రోడ్లపైకి నో ఎంట్రీ అంటోంది సర్కార్. ఇదే ఇప్పుడు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
15ఏళ్లు పైబడిన వాహనాలు హైదరాబాద్‌లో తిరగకుండా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి త్వరలోనే పాలసీని తెస్తామంటున్నారు సీఎం రేవంత్. అయితే ప్రస్తుతానికి దీన్ని గ్రేటర్ హైదరాబాద్‌కి మాత్రమే పరిమితం చేయబోతున్నారు. తెలంగాణలో లక్షల కొద్దీ వాహనాలు కాలం చెల్లినవి ఉన్నాయి. అక్టోబర్ నాటికి లెక్కలు తీస్తే 41.86లక్షల వాహనాల జీవితకాలం ముగిసింది. ఇందులో 31.36లక్షలు ద్విచక్రవాహనాలే. అంటే 75శాతానికి పైగా టూవీలర్స్ తుక్కుచేయాల్సినవే.
లక్షల్లో కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై యధేచ్ఛగా తిరుగుతుండడంతో కాలుష్యమే కాదు ప్రమాదాలూ పెరిగిపోతున్నాయి. వాహనాలకు ఫిట్‌నెస్ లేకపోవడంతో అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో నిత్యం 20మందికిపైగా చనిపోతున్నారు.ప్రస్తుతం తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాల సంఖ్య 21 లక్షలు ఉంటే…వాటిలో 9 లక్షల వాహనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇక 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.
ఇంకా డిటైల్డ్‌గా చూస్తే….ఆటోరిక్షాలు లక్షా 14వేల 933, కాంట్రాక్ట్ క్యారేజీలు 4వేల375, కాలేజ్ బస్సులు 5వేల824, గూడ్స్ క్యారేజీలు, లక్షా 81వేల387, మ్యాక్సీ క్యాబ్‌లు 4వేల 609, మోటార్ క్యాబ్‌లు 24వేల 111, మోటార్ సైకిళ్లు 11, ఇతర వాహనాలు 4వేల683, ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 1542, స్టేజి క్యారేజీలు 6వేల869, ట్రాక్టర్లు, ట్రాలర్లు 66వేల787 ఉన్నాయి. ఇక జీవితకాలం దాటినవి చూస్తే రవాణా వాహనాలు 4లక్షల 15వేల 131, వ్యక్తిగత వాహనాలు 37లక్షల 71వేల 606 ఉన్నాయి.
అయితే కాలం చెల్లిన వాహనాలను ఇప్పటికిప్పుడు స్క్రాప్‌కు పంపుతారా అంటే కాదు..కానీ నియంత్రించాల్సిన అవసరం ఉందంటోంది ప్రభుత్వం. ఒకవేళ ఫిట్‌నెస్ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు..కానీ కండీషన్స్ అప్లై అంటున్నారు మంత్రి పొన్నం. ఫిట్‌నెస్ బాగుంటే 5 వేల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఐదేళ్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటే..10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. అంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే వాహనాలు నడుపుకోవచ్చంటున్నారు మంత్రి పొన్నం. ఇక ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన 15 ఏళ్ల గడువుకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ కింద కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్నారు పొన్నం.
తెలంగాణ ప్రభుత్వం ఈమధ్యనే రవాణాశాఖలో పలు కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా.. వెహికిల్ స్క్రాప్ పాలసీ, వాహనాల ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు, వాహన్ సారథి పోర్టల్ అమలు, ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం, అవగాహన కల్పించడం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టింది.. దానిలో భాగంగా.. దేశంలోని 28 రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న భారత మోటారు వాహన చట్టంలోని వాహన్ సారిథి తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు. దీని ద్వారా వాహనదారులకు సంబంధించిన అంతరాష్ట్ర ఇబ్బందులకు చెక్ పడనుంది. అలాగే.. వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలుకు నిర్ణయించారు. ప్రైవేట్ వాహనాల వాలెంటరీ వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ద్వారా వాహనదారులకు సర్టిఫికెట్లు ఇస్తాయి.. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే లైఫ్ టాక్స్‌లో రాయితీలు లభిస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని పాలసీలను అధ్యయనం చేసి.. తెలంగాణలోనూ అమలు చేసేందుకు కొత్తగా జీవో తీసుకురానుంది. ఇక వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్ కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆర్టీవో ఆఫీసుల్లో వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్ సరిగ్గా జరగడం లేదు.. ఇకపై ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లలో వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది సర్కార్.
సో…. ఇప్పుడు సీఎం రేవంత్ చెప్పినదాని ప్రకారం చూస్తే 15 ఏళ్లు దాటిన వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు. అలాంటప్పుడు వాహనదారుల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఇతర జిల్లాల్లో వాడుకోవచ్చు. లేదా ఇతర జిల్లాలకు తీసుకుని వెళ్లి అమ్మేసుకోవచ్చు. పాత వాహనం అప్పగించి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. దానికి ట్యాక్స్ మినహాయింపులు ఇస్తారు ప్రభుత్వం లేటెస్ట్ స్టేట్‌మెంట్‌తో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలు హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఫిట్నెస్ లేని వాహనాల వల్ల భవిష్యత్తులో పెద్దవాయు ఉపద్రవం రాబోతుందని సైంటిస్టులు అంటున్నారు.
వాహనాలను తమ ఇంటి సభ్యులుగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు.ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ సూపర్ ట్రాక్ రికార్డును మైంటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు.అయితే అధిక శాతం మంది మాత్రం వాహనాలను నడుపుతున్నారు గాని వాటి మెయింటెనెన్స్ చెక్ చేయించుకోవడంలేదు. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఢిల్లీలో పదేళ్లకి మించిన డీజిల్ వాహనాలు రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అలాంటి వెహికిల్స్ ఓసారి పట్టుబడితే…అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి విడిపించుకోవాల్సి ఉంటుంది. మూడు వారాల్లోగా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఆ వెహికిల్‌ని స్క్రాప్ కింద పరిగణిస్తారు. అప్లికేషన్ రిజెక్ట్ అయినా చెత్తకిందకే వస్తుంది.
మరోవైపు వాహనాల నుంచి వచ్చే కాలుష్యాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2027 నాటికి దేశంలో డీజిల్‌తో నడిచే ఫోర్-వీలర్ వాహనాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నివారించాలని భావిస్తోంది. వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను తగ్గించేందుకు వినియోగదారులు ఎలక్ట్రిక్, గ్యాస్ తో నడిచే వాహనాలకు మారేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. భారత్ లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాల వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2070 నాటికి దేశంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాలు లేకుండా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2030 నాటికి, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2024 నుంచి ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో.. డీజిల్ బస్సులను వినియోగించకూడదనే నిబంధనను తీసుకురావాలన్న యోచనలో ఉంది కేంద్రం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..