Telangana: ఒరిజినల్ పాలని తెగ తాగేస్తున్నారా.! ఈ వీడియో చూస్తే.. ఇక మానుకుంటారు..

హైదరాబాద్ వాసులారా మీరు పాలు తాగుతున్నారా.? పరిసర జిల్లాల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారా..! అయితే జాగ్రత్త. కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేసి విషంగా మారుస్తున్నారు. ఆ కల్తీ పాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు దందా జోరుగా సాగుతోంది. కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. స్థానికంగా కల్తీ పాల తయారీ కలకలం రేపుతోంది.

Telangana: ఒరిజినల్ పాలని తెగ తాగేస్తున్నారా.! ఈ వీడియో చూస్తే.. ఇక మానుకుంటారు..
Adulteration Milk
Follow us
M Revan Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Dec 17, 2023 | 1:57 PM

హైదరాబాద్ వాసులారా మీరు పాలు తాగుతున్నారా.? పరిసర జిల్లాల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారా..! అయితే జాగ్రత్త. కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేసి విషంగా మారుస్తున్నారు. ఆ కల్తీ పాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు దందా జోరుగా సాగుతోంది. కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. స్థానికంగా కల్తీ పాల తయారీ కలకలం రేపుతోంది. కల్తీ వ్యాపారులపై పోలీసుల వరుస దాడులు జరుగుతున్నప్పటికీ కేటుగాళ్లు అధిక లాభాల కోసం కక్కుర్తి పడి పాలను కల్తీ చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో నిత్యం చెలగాటమాడుతున్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు చేస్తున్న దాడుల్లో కల్తీ పాల తయారీ కేంద్రాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కులలో కల్తీ పాలు తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని భువనగిరి ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలం గౌస్‌కొండలో కల్తీ పాల వ్యాపారం చేస్తున్న అస్గర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 200 లీటర్స్ కల్తీ పాలు, 100 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ పాల దందా..

యాదాద్రి జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో వేలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వందలాది మంది ఈ పాల వ్యాపారం మీదనే ఆధారపడ్డారు. హైదరాబాద్‌కు అతి సమీపాన ఉండడంతో నిత్యం లక్షలాది లీటర్ల పాలు హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ పాలను కల్తీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో విచ్చలవిడిగా కల్తీపాల తయారీ ప్రధానంగా బొమ్మలరామారం, బీబీనగర్‌, భువనగిరి, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో ఈ దందా కొనసాగుతోంది. పౌష్టికాహారాన్ని అందించే స్వచ్ఛమైన పాలను కొందరు కల్తీ కేటుగాళ్లు విషంగా మారుస్తున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం కల్తీ పాల తయారీపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్‌, యాదాద్రి భువనగిరి జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో దాదాపు 13 చోట్ల అక్రమాలు బయటపడ్డాయి. గతంలో అనేకసార్లు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కల్తీ పాలను గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు.

కల్తీపాల తయారీ ఇలా..

కేటుగాళ్లు యూరియా, డిటర్జంట్  పౌడర్, బేకింగ్ సోడా, రిఫైండ్ ఆయిల్, కొన్ని రకాల కెమికల్స్‌తో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. కల్తీ పాల తయారు చేయడానికి నీటిలో 5 కిలోల యూరియాను కలుపుతారు. దీంతో పాలు తెల్లగా మారుతాయి. దానికి 250 గ్రాముల డిటర్జెంట్, కొంచెం రిఫైండ్ ఆయిల్ కలుపుతారు. కెమికల్‌తో తయారు చేసిన పాలలాగ వాసన వచ్చే తెల్లటి పౌడర్‌ను కూడా మిక్స్ చేస్తారు. ఇలా తయారు చేసిన 40 లీటర్ల ద్రవంలో 60 లీటర్ల పాలు కలిపి 100 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన పాలను గుర్తించడం సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి. జిల్లాలోని భువనగిరి, బొమ్మలరామారం, బీబీనగర్‌, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలు కల్తీ పాలకు అడ్డాగా మారడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి చేరువలో ఉండడమే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకపోవడంతో వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. కల్తీ పాలను హైదరాబాద్‌కు తరలించిన అనంతరం స్వీట్‌హౌజ్‌లు, హోటళ్లు, గృహ సముదాయలకు సైతం సరఫరా చేస్తున్నారు.

కల్తీ పాలతో ప్రాణాంతక వ్యాధులు..

కల్తీ పాల పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారైతే వణికిపోతున్నారు. కల్తీ పాలతో తమ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందోనని తల్లులు ఆందోళన చెందుతున్నారు. పౌష్టికాహారంగా భావించిన పాలు కల్తీ కావడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కల్తీ పాలతో చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. హైడ్రోజన్‌ ఫెరాక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్‌, సుక్రోజ్‌, నూనె, యూరియా, సర్ఫ్‌, బేకింగ్‌ సోడా, యూరియా, పాల పొడి లాంటి రసాయన పదార్థాలను వినియోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. కల్తీ పాలలో కలిపే యూరియా, కెమికల్స్‌, వంట నూనె వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్‌, గ్యాస్‌, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్‌, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దుష్ప్రరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో యాదాద్రి జిల్లాలో కల్తీ పాల తయారీ ఎక్కువ అయిందన్న విషయాన్ని పోలీసులు కూడా అధికారులు అంగీకరిస్తున్నారు. ఎక్కువసార్లు కల్తీ పాల తయారీతో పట్టుబడినవారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తున్నామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కల్తీ పాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.