NZ vs SA T20 WC 2026 : డికాక్ చేసిన ఒకే ఒక్క తప్పు.. వరల్డ్ కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్
NZ vs SA T20 WC 2026 : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది.

NZ vs SA T20 WC 2026 : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓటమికి ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేసిన ఒక చిన్న పొరపాటే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్ ఆరంభంలోనే డికాక్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఆ జట్టును టోర్నీ నుంచే బయటకు పంపేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అయితే కివీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కగిసో రబడా వేసిన మొదటి బంతిని సీఫెర్ట్ భారీ షాట్ ఆడబోగా, అది టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో డీప్ ఫైన్ లెగ్ వద్ద ఉన్న డెవాల్డ్ బ్రెవిస్ ఆ క్యాచ్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ వికెట్ల వెనుక ఉన్న డికాక్ నేను పడతాను అంటూ అరుస్తూ వెనక్కి పరుగెత్తాడు. తీరా బంతి దగ్గరకు వెళ్లేసరికి దానిని అందుకోలేక క్యాచ్ వదిలేశాడు.
— Nickk Knight (@KnightNick34590) March 4, 2026
నిజానికి ఆ క్యాచ్ బ్రెవిస్‌కు చాలా సులభం అయ్యేది. కానీ డికాక్ అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల ఆ సువర్ణావకాశం చేజారింది. ఆ సమయంలో సీఫెర్ట్ కేవలం 11 పరుగుల వద్దే ఉన్నాడు. దొరికిన లైఫ్ లైన్ సీఫెర్ట్ వృధా చేయలేదు. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడి 33 బంతుల్లోనే 58 పరుగులు బాదాడు. అటు ఫిన్ అలెన్ కూడా 33 బంతుల్లోనే అజేయ సెంచరీ (100*) సాధించడంతో న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే కివీస్ ఒత్తిడిలో పడేదని, ఫలితం మరోలా ఉండేదని దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విజయంతో న్యూజిలాండ్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరులో భారత్ లేదా ఇంగ్లాండ్‌తో కివీస్ తలపడనుంది. సౌతాఫ్రికా మాత్రం మరోసారి సెమీస్ గండం దాటలేక చోకర్స్ ముద్రను అలాగే ఉంచుకుంది. ఒక క్యాచ్ మ్యాచ్‌ను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
