AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆపరేషన్‌ హైడ్రా – మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..

హైదరాబాద్‌లో హైడ్రా హడల్‌.. సిటీ జనాల్లో వీకెండ్‌ దడ.. మూసీ పరివాహకంలో టెన్షన్‌.. టెన్షన్‌.. ఆపరేషన్‌ హైడ్రా.. ఆపరేషన్‌ మూసీ.. హైదరాబాద్‌ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. హైడ్రా వారాంతపు దాడులు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్‌లు భయపెడుతున్నాయి. శనివారం, ఆదివారం వస్తుందంటేనే హైదరాబాద్‌ ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు.. హైడ్రా బుల్డోజర్లు వచ్చి పడతాయోనని టెన్షన్‌ పడిపోతున్నారు.

Hyderabad: ఆపరేషన్‌ హైడ్రా - మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..
Hydra
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2024 | 8:19 AM

Share

ఒకవైపు హైడ్రా హడల్‌.. మరోవైపు మూసీ సుందరీకరణ గుబులు.. వెరసీ.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితులు.. అటు.. మూసీ రివర్‌ బెడ్‌ పరిధిలోని ఇళ్లకు రెడ్‌ మార్క్‌లు.. ఇటు.. చెరువులు, నాలాల పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు.. ఇంకేముంది.. హైదరాబాద్‌లోని పలు ఆయా ప్రాంతాలవారు వణికిపోతున్నారు. బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కొనుగోలు చేసినవారు హైరానా పడుతున్నారు. హైడ్రా బుల్డోజర్‌ ఎప్పుడు తమపైకి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లు బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా.. తమ పరిస్థితి ఏమిటని గుబులు చెందుతున్నారు. దాంతో.. హైదరాబాద్‌లో హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. మూసీ పరివాహకంలో అధికారుల చేస్తున్న సర్వేలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా లేదా కూల్చివేతలపై భయపడవద్దని సూచించారు.

మహిళ ఆత్మహత్య.. రంగనాథ్ ఏమన్నారంటే..

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోనూ హైడ్రా హడల్‌ కొనసాగుతోంది. ఇప్పటికే.. కూకట్‌పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనలు రేపాయి. ఇళ్లు కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. అనుమానాలు ఉన్న ప్రాంతాలవారు టెన్షన్‌తో సతమతం అవుతున్నారు. హైడ్రా ఆందోళనల నేపథ్యంలోనే.. కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని యాదవబస్తీలో బుచ్చమ్మ అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. కూతురికి ఇచ్చిన ఇంటిని కూల్చివేస్తామని హైడ్రా అధికారులు చెప్పడంతో.. మనస్తాపం చెందిన బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల భయంతోనే తమ తల్లి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలి కుమార్తె.

రూపాయి.. రూపాయి.. కూడబెట్టుకున్న డబ్బులతో ఇల్లు కట్టి కూతుళ్లకు ఇచ్చిందన్నారు స్థానికులు. ఇప్పుడు సడెన్‌గా ఆ ఇంటిని కూల్చివేయనున్నట్లు అధికారులు తెలియజేయగా.. ఎప్పుడు హైడ్రా యంత్రాంగం వచ్చి ఇంటిపై పడుతుందోననే టెన్షన్‌తో ప్రాణాలు తీసుకున్నట్లు చెప్పారు.

హైడ్రా కు భయపడి మహిళ కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకుందన్న వార్తపై స్పందించిన హైడ్రా చీఫ్ రంగనాథ్.. అక్కడ HYDRAA ఎవరికి నోటీసులు ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. హైడ్రాపై భయం సృష్టించేలా మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేయడం ఆపాలన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కూల్చివేత హైడ్రా కారణంగా జరుగుతోందని అవాస్తవాలు వ్యాపిస్తున్నాయన్నారు. హైడ్రా ముసీ నది కూల్చివేతల కోసం ఏ సర్వేలో భాగంగా లేదన్నారు. రేపు ముసీ నదిలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరగబోతున్నాయనే తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని.. కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ హైడ్రాపై కుట్రతోనూ, తప్పుడు దుష్ప్రచారంతోనూ అసత్యాలను వ్యాపింపజేస్తున్నాయన్నారు. ప్రజలు హైడ్రా లేదా కూల్చివేతలపై భయపడవద్దని.. ఎవరికీ నోటీసులు ఇవ్వలేదంటూ కమిషనర్ తెలిపారు.

అత్తాపూర్‌‌లో ర్యాలీ..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ మూసీ ప్రాంత వాసులు రోడ్డెక్కారు. సర్వేను వ్యతిరేకిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది ప్రజలు పాల్గొన్నారు. హైడ్రా హడల్‌తో దినదినం భయంతో బ్రతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలు చేసిననాటి నుంచి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందన్నారు. వృద్దాప్యంలో ఉన్న తమను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం టెన్షన్‌కు గురిచేస్తుందని.. ఈ వయస్సులో తమకెందుకు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.

మొత్తంగా… హైడ్రా వీకెండ్‌ దాడులు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్‌ మార్క్‌లు దడపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా.. శనివారం, ఆదివారం వస్తుందంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ, రేపట్లో హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వాలిపోతాయో.. ఏ రేంజ్‌లో కూల్చివేతలు ఉంటాయోనని ఆయా ప్రాంతాల ప్రజలు టెన్షన్‌ పడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..