Telangana: రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారు.. సీఎం కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న...
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను మర్యాద పూర్వకంగా కలిశానని, ఈ సమావేశం అనంతరం అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయని చెప్పారు. అమిత్ షాను (Amit Shah) కలవటం ఇప్పుడేం కొత్త కాదన్న రాజగోపాల్ రెడ్డి.. అనేక సార్లు కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ దినపత్రికతో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కార్యకర్తలు, అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు , అభిమానులు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురికావద్దని సూచించారు.
మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా అదనంగా కేటాయించలేదు. అనేక సంవత్సరాలుగా అడుగుతున్న గట్టుప్పల్ మండలాన్ని వెంటనే ప్రకటించారు.నాయకులను కొనేందుకు రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారు. భువనగిరి లోక్ సభతో పాటు మునుగోడు శాసనసభ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. అందరితో కలిసి చర్చించిన తర్వాతే కేసీఆర్ కుటుంబం, ఆయన అవినీతి కుటుంబ పాలనపై మన బహిరంగ యుద్ధ ప్రకటన చేద్దాం. అది కూడా లక్ష మంది సమక్షంలో చేస్తాం. నేను అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రతిపాదించిన కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వాలి.
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
ఎనిమిదేళ్లుగా ఎస్ఎల్బీసీ సారంగంతోపాటు, అన్నీ పూర్తయిన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ పనులను పక్కనబెట్టిన కేసీఆర్.. ఇప్పుడు హడావిడి చేస్తున్న తీరును ప్రజలంతా గమనించాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలతో సమానంగా అన్ని విధాలుగా వెనకబడిపోయిన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు ముందుకు వస్తే తాను ఏ త్యాగానికైనా సిద్ధమని వెల్లడిచారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ అండ్ టీం చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి