MUNUGODU BY-ELECTION: నెక్స్ట్ లెవెల్‌కి మునుగోడు ప్రచారం.. అగ్రనేతల ప్రచారానికి పార్టీల వ్యూహం.. ఇక మిగిలింది వారమే

ప్రచార పర్వానికి ఇంకా వారం రోజులే గడువు మిగిలి వుండడంతో ప్రధాన పార్టీలు అధినేతల ప్రచారానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. పైకి ప్రచార పర్వం నెమ్మదించినా.. గత రెండ్రోజులుగా పండుగ సందర్భాన్ని ప్రధాన పార్టీలు బాగానే వినియోగించుకున్నాయి.

MUNUGODU BY-ELECTION: నెక్స్ట్ లెవెల్‌కి మునుగోడు ప్రచారం.. అగ్రనేతల ప్రచారానికి పార్టీల వ్యూహం.. ఇక మిగిలింది వారమే
Bjp , Congress , Trs Flags
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 25, 2022 | 4:12 PM

మునుగోడులో ప్రచారం ఇక నెక్స్ట్ లెవెల్‌కు చేరనున్నది. దీపావళి, లాంగ్ వీకెండ్ కావడంతో గత రెండు రోజులుగా మరీ ముఖ్యంగా అక్టోబర్ 23, 24 తేదీలలో కాస్త నెమ్మదించిన ప్రచారం.. అక్టోబర్ 25 నుంచి జోరందుకోనున్నది. ప్రచార పర్వానికి ఇంకా వారం రోజులే గడువు మిగిలి వుండడంతో ప్రధాన పార్టీలు అధినేతల ప్రచారానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. పైకి ప్రచార పర్వం నెమ్మదించినా.. గత రెండ్రోజులుగా పండుగ సందర్భాన్ని ప్రధాన పార్టీలు బాగానే వినియోగించుకున్నాయి. పండగ వేళ మందు, మాంసాహారాలను వెదజల్లి మునుగోడు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు యధాశక్తి యత్నించాయి. కాస్ట్లీ మందు బాటిళ్ళను అభ్యర్థుల క్యాంపుల నుంచి పట్టుకుపోతున్న మునుగోడు ఓటర్ల వీడియో క్లిప్పింగ్స్ సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికలుగా విశేష స్థాయిలో సర్క్కులేట్ అయ్యాయి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా మందు బాటిళ్ళను ముసిముసినవ్వులతో తీసుకు వెళుతున్న వీడియోలు చాలానే దర్శనమిచ్చాయి. ఈ కాస్ట్లీ మద్యాన్ని ఏ పార్టీ వారు సరఫరా చేశారన్న అంశాన్ని పక్కన పెడితే మునుగోడు ఓటర్ల పంట పండిందనడానికి ఈ వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మందు ఒక్కటే కాదు.. ప్రతీ ఇంటికీ చికెన్, మటన్ పంపిణీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మధ్యాహ్నం పార్సిల్ ఒక పార్టీ నుంచి వస్తే సాయంత్రానికి మరో పార్టీ నుంచి ఇంటింటికి పార్సిల్ పథకం కొనసాగుతోంది. డబ్బుకు డబ్బు.. పైనుంచి మద్యం, మాంసం.. యమా రంజుగా మునుగోడు రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా నిల్వబోతోంది. ఇదే కాకుండా తమ ప్రచారంలో పాల్గొన్నా.. రోడ్ షోలో కాసింత సేపు కలిసి నడిచినా.. 300 నుంచి 600 రూపాయల దాకా కూలీ దక్కుతుండడంతో మునుగోడు లోకల్సే కాదు.. ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి కూడా కూలీలు తరలి వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే సందర్భంలో మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. గత నెలరోజులుగా తమతమ నియోజకవర్గాలను వదిలేసి మునుగోడులో మకాం వేయడం ద్వారా తాము తమ నియోజకవర్గంపై పోకస్ చేస్తామన్న ప్రమాణాన్ని విస్మరించినందు వల్ల మునుగోడులో మకాం వేసిన ఎమ్మెల్యేల నెల జీతంలో కోత విధించాలని అకునూరి మురళి కామెంటారు. అఫ్‌కోర్స్ ఆయన డిమాండ్ సమంజసంగానే కనిపిస్తున్నా.. ఆచరణలో సాధ్యం కాదన్నది ఆయనకూ తెలుసే వుంటుంది.

ఇక పార్టీల ప్రచారం విషయానికి వస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలి. పార్టీకి పునర్వైభవాన్ని తెచ్చే ప్రణాళికతో అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతల నెత్తిన పాలు పోసిందని చెప్పాలి. యాదృచ్చికమే అయినా మునుగోడు ప్రచారం పీక్ లెవెల్‌కు చేరుకున్న సందర్భంలో రాహుల్ గాంధీ తెలంగాణలోకి ఎంటరయ్యారు. దీపావళి పండుగతోపాటు పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదవీ బాధ్యతల స్వీకారంలో పాల్గొనేందుకు మూడు రోజుల పాటు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 27వ తేదీన పాదయాత్ర తెలంగాణలో మొదలవుతుంది. ఇక అత్యంత కీలకమైన రోజున రాహుల్ గాంధీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గడపబోతున్నారు. దాన్ని మునుగోడుపై ప్రభావం చూపించేలా ప్లాన్ చేశారు టి.కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ నగరంలో నవంబర్ 1వ తేదీన కొనసాగనున్న పాదయాత్రకు రాహుల్‌తో పాటు మొత్తం ఆయన కుటుంబాన్ని రప్పించేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి వున్న సమాచారం మేరకు నవంబర్ ఒకటవ తేదీన సోనియా గాంధీ, ప్రియాంక వధేరాలిద్దరు రాహుల్ గాంధీతోపాటు మహానగరంలో పాదయాత్ర చేయబోతున్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ భారీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత పీపుల్స్ ప్లాజాలో జరిగే సభలో అగ్రనేతలు ముగ్గురు ప్రసంగించే అవకాశాలున్నాయి. ఈ రకంగా మునుగోడుకు డైరెక్టుగా వెళ్ళకుండా అక్కడి ఓటర్లకు గాంధీ కుటుంబ సభ్యల నుంచి ప్రత్యక్ష సందేశాన్ని పంపేలా వ్యూహరచన చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే ఇక్కడ గాంధీ కుటుంబాన్ని కాస్త ఇరాకటంలో పడేసే అంశం ఒకటి కనిపిస్తోంది. రాహుల్ తన కుటుంబీకులతో కలిసి పాల్గొనే పీపుల్స్ ప్లాజా సభకు కూత వేటు దూరంలోనే దివంగత ప్రధాని, తెలంగాణ తేజం పీవీ నరసింహారావు సమాధి వుంటుంది. ఆ సమాధి మీదుగా పాదయాత్ర చేసే రాహుల్ అక్కడ నివాళులు అర్పిస్తారా ? లేక పీవీ పట్ల గత రెండు దశాబ్దాలుగా పీవీ పట్ల అవలంభిస్తున్న అవమానకర ధోరణినే గాంధీ ఫ్యామిలీ కొనసాగిస్తుందా అన్న అంశం ఆసక్తి రేపుతోంది. ఈ సంగతి పక్కనపెడితే.. రాహుల్ పాదయాత్రకు ప్రత్యేక వ్యూహరచన చేయడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుచూపు ప్రదర్శించారనే చెప్పాలి. నవంబర్ 1న రాత్రి (అదే రోజు మునుగోడు ప్రచార పర్వం ముగుస్తుంది) హైదరాబాద్ బోయినపల్లి గాంధీ అధ్యయన సంస్థలో రాహుల్ బస చేస్తారు. నవంబర్ రెండో తేదీన కూడా ఆయన హైదరాబాద్ నగరంలోనే పాదయాత్ర చేస్తారు. రాత్రికి అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ముత్తంగిలో బస చేస్తారు. ఉప ఎన్నిక పోలింగ్ జరిగే నవంబర్ 3వ తేదీన కూడా రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది. కాగా.. మునుగోడు ఫలితం వెల్లడయ్యే నవంబర్ 6వ తేదీన కూడా రాహుల్ గాంధీ తెలంగాణలోనే వుంటారు. ఫలితం వెల్లడైన మర్నాడు ఆయన జుక్కల్, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ఎంటరవుతారు. ఓరకంగా చెప్పాలంటే మునుగోడు ప్రచార పర్వం కొనసాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేయడం కాంగ్రెస్ అభ్యర్థికి ఎంతో కొంత ప్రయోజనకరంగా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే గత పదిహేను రోజులుగా తమ అన్ని శ్రేణులను, నాయకగణాన్ని, ఎమ్మెల్యేల బృందాన్ని మునుగోడు బరిలోకి దింపింది. దాదాపు మంత్రులందరు మునుగోడులోనే మకాం వేశారు. గ్రామాలను.. మరీ లోతుగా చూస్తే వార్డుల వారీగా విభజించుకుని ప్రతీ ఓటరుని కలిసేలా గులాబీ వ్యూహం అమలవుతోంది. అది సరిపోదన్నట్లు హైదరాబాద్ శివారుల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి కులాల వారీగా మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు. కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రోజుకో రోడ్ షోలో పాల్గొని బీజేపీని తూర్పారపడుతున్నారు. తాము గెలిస్తే మునుగోడు పంట పండిస్తామని చెబుతున్నారు. మరో మంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారవడంతో మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈక్రమంలో ఈ వారం రోజులు అత్యంత క్రూషియల్ కావడంతో గులాబీ బాస్ రంగంలోకి దిగబోతున్నారు. అక్టోబర్ 30న గానీ, 31వ తేదీన గానీ కేసీఆర్ మునుగోడుకు వెళనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మునుగోడుకు వెళ్ళడం ద్వారా మార్గమధ్యంలో ప్రతీ గ్రామాన్ని సందర్శించి, స్ట్రీట్ మీటింగ్ ద్వారా వారిని అడ్రస్ చేసేలా కేసీఆర్ పర్యటన ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు మండల కేంద్రంలో భారీ సభకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే మరో వ్యూహం కూడా పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు నియోజకవర్గంలో పర్యటించి వెళ్ళిన తర్వాత కేసీఆర్ సభ నిర్వహిస్తే బెటర్ అని పార్టీలో కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రచార పర్వంలో చివరి రోజు అంటే నవంబర్ ఒకటో తేదీన కేసీఆర్ మునుగోడు ప్రచార సభలో పాల్గొనే అవకాశం వుంది. కేసీఆర్ రెండు రోజులపాటు మునుగోడులో ప్రచారం చేస్తారని ఓ వర్గం.. కాదు ఒకే రోజు రోడ్ షో, బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని మరో వర్గం చెబుతోంది. ఇక చావోరేవో తేల్చుకునేందుకు బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమలం నేతలు పూర్తిస్థాయిలో అండాదండగా నిలుస్తున్నారు. ఆయన్ను మునుగోడులో గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీపావళి సందర్భంగా ఇళ్ళకు తిరిగి వెళతారేమో అన్న సందేహంతో బీజేపీ నేతలంతా నియోజకవర్గంలోనే వుండాలని, పండగ కూడా అక్కడి ఓటర్ల మధ్యే జరుపుకోవాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలకు ఆదేశాలిచ్చింది. దాంతో జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా కీలక నేతలంతా మునుగోడులోనే దీపావళి సంబరాలను జనం మధ్య జరుపుకున్నారు. కాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పీ.నడ్డాను నియోజవర్గం ప్రచారానికి రప్పించేందుకు టీ.బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీన ఆయన మునుగోడు ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. సో.. నవంబర్ 1న ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అగ్రనేతలను ప్రచారానికి రప్పించే ప్రణాళికతో ప్రధాన పార్టీలున్నాయి. అదేసమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఇతరత్రా మార్గాలను కూడా మరింత వేగిరపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.