AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కన్నబిడ్డను కడతేర్చబోయిన కష్టం.. దేవుడిలా వచ్చిన ఆటోడ్రైవర్.. అసలు ఏం జరిగిందంటే..?

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కళ్లముందే అనారోగ్యంతో అల్లాడిపోతున్న కన్నబిడ్డ.. సరైన వైద్యం అందించలేని నిస్సహాయ స్థితి ఓ తల్లితో ఊహించని ఘోరానికి ఒడిగట్టేలా చేసింది. తన ఆరేళ్ల కూతురిని స్వయంగా హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసిన విషాదకర ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

Hyderabad: కన్నబిడ్డను కడతేర్చబోయిన కష్టం.. దేవుడిలా వచ్చిన ఆటోడ్రైవర్.. అసలు ఏం జరిగిందంటే..?
Mother Throws Daughter Hussain Sagar
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Oct 09, 2026 | 4:09 PM

Share

కష్టాలు చుట్టుముట్టాయి.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి.. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు మెరుగైన వైద్యం అందించలేని పరిస్థితి ఆమెను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అయితే ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆరేళ్ల చిన్నారి ప్రాణాలనే ప్రమాదంలో పడేసింది. కన్నకూతురిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌ మానవత్వంతో స్పందించి నీటిలోకి దూకి చిన్నారిని కాపాడాడు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేట్‌కు చెందిన షబానాను ఐదేళ్ల క్రితం ఆమె భర్త విడిచిపెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల బాధ్యతను ఆమె ఒక్కరే చూసుకుంటున్నారు. ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.

ఈ క్రమంలో ఆమె రెండో కూతురు రుక్సానా (6) పెద్దపేగు ఇన్‌ఫెక్షన్‌తో కొంతకాలంగా బాధపడుతోంది. చిన్నారికి స్థానికంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదని సమాచారం. మెరుగైన వైద్యం అవసరమవడంతో పాటు అందుకు అయ్యే ఖర్చును భరించే స్థోమత లేకపోవడం ఆమెను మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో రుక్సానాను వెంట తీసుకొని హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. అక్కడ ఏం జరిగిందో ఏమో.. చివరకు తన ఆరేళ్ల కూతురును సాగర్ నీటిలోకి విసిరేసింది. చిన్నారి నీటిలో పడిపోవడాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్‌ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నీటిలోకి దూకి బాలికను బయటకు తీసుకొచ్చాడు. అతడి సకాల స్పందనతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రుక్సానా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దోమలగూడ ఇన్‌స్పెక్టర్ అంజన్ అలీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.

కన్నబిడ్డను కాపాడుకోవాల్సిన తల్లే ఆమెను ప్రమాదంలోకి నెట్టడం ఒకవైపు ఆవేదన కలిగిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి చిన్నారిని రక్షించిన ఆటో డ్రైవర్‌ చర్య మరోవైపు మానవత్వాన్ని చాటింది. కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా.. వాటికి పరిష్కారంగా చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవడం సమర్థనీయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమస్య ఎంత పెద్దదైనా సహాయం కోరడం, అందుబాటులో ఉన్న వైద్య, సామాజిక సేవలను ఆశ్రయించడం ఎంతో ముఖ్యం. ఆపదలో ఉన్న కుటుంబాలకు సకాలంలో అండ లభిస్తే ఇలాంటి విషాదకర పరిస్థితులను నివారించే అవకాశం ఉంటుంది.

Follow Us