AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miyapur Land Issue: ఉద్రిక్తతకు అసత్య ప్రచారమే కారణమా..? మియాపూర్‌లో ఏం జరిగింది..

అసత్య ప్రచారం ఆందోళనలకు కారణమైంది. మియాపూర్‌ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయిస్తున్నారన్న ఫేక్‌ న్యూస్‌...ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అమాయక ప్రజలను రెచ్చగొట్టి పలువురు నాయకులు భూకబ్జాకు ప్లాన్‌ చేస్తున్నారని పోలీసులు చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Miyapur Land Issue: ఉద్రిక్తతకు అసత్య ప్రచారమే కారణమా..? మియాపూర్‌లో ఏం జరిగింది..
Miyapur Land Issue
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2024 | 9:46 AM

Share

హైదరాబాద్‌ మియాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీప్తిశ్రీనగర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వేలాది మంది గుడిసెలు వేయడం… విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ఖాళీ చేయించేందుకు అక్కడికి వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం దాడికి కారణమైంది. పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. కర్రలతో దాడి చేశారు. అయినప్పటికీ భారీ బలగాలతో వచ్చి ఎట్టకేలకు స్థలాన్ని ఖాళీ చేయించారు పోలీసులు.

శేరిలింగంపల్లి మండలం దీప్తిశ్రీనగర్‌లో ఉన్న 100,101 సర్వే నెంబర్లు గల సుమారు 500 ఎకరాల హెచ్ఎండీఏ భూమిని పేదలకు కేటాయిస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెద్ద ఎత్తున సర్క్యూలేట్‌ కావడంతో… రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు రెండు వేల మంది గుడిసెలు వేసుకుని… మూడు, నాలుగు రోజులుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న హెచ్‌ఎండీఏ అధికారులు, మియాపూర్‌ పోలీసులతో కలిసి వారిని ఖాళీ చేయించేందుకు వెళ్లారు. ముందుగా అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇది ప్రభుత్వ భూమని… ఇంకా ఎవరికి కేటాయించలేదని, ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక పలువురు వ్యక్తులు కొన్నారని తెలిపారు రెవెన్యూ అధికారులు. ఈ భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్దారించి హెచ్‌ఎండిఏ కు అప్పగించిందన్నారు. దీంతో ఈ భూమిని కొన్నవారు సుప్రీం కోర్టును అశ్రయించారని అధికారులు వెల్లడించారు. మరోవైపు పోలీసులు సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వారి పేర్లను త్వరలోనే చెబుతామన్నారు. స్థలాలు ఇస్తున్నారని ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 30 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు.

డ్రోన్లతో గస్తీ..

ప్రభుత్వ స్థలం నుంచి ఖాళీ చేయించిననేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. మియాపూర్‌లో పోలీస్‌ బందోబస్తు కొనసాగుతోంది.. ప్రభుత్వ భూముల వైపు ఎవరినీ అనుమతించడం లేదు.. నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల ముందుజాగ్రత్త చర్యలుచేపట్టారు. వివాదాస్పద ల్యాండ్‌లో డ్రోన్లతో పోలీసులు గస్తీ కాస్తున్నారు..

మొత్తంగా… మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ ఇష్యూ రచ్చ లేపుతోంది. ప్రస్తుతానికి ఖాళీ చేసినప్పటికీ… తమకు కేటాయించేవరకు ఊరుకునేదే లేదంటున్నారు జనం. మరి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..