AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu – Revanth Reddy: భేటీకి వేళాయే.. చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..

విభజన అంశాలపై చర్చించుకుందామంటూ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఆసక్తిరేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ నెల 6న సమావేశమవుదామని సోమవారం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు.

Chandrababu - Revanth Reddy: భేటీకి వేళాయే.. చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..
Chandrababu Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 02, 2024 | 9:42 PM

Share

విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఆసక్తిరేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ నెల 6న సమావేశమవుదామని సోమవారం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. విడిపోయి పదేళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఈ నెల 6న భేటీకి సిద్ధమని లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రజాభవన్‌లో చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని సీఎం రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం నిజంగా అత్యవసరమంటూ తెలిపారు.

కాగా.. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

రెండు రాష్ట్రాలు షేర్‌ చేసుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు.. తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైనా ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. రోడ్లు,భవనాల శాఖకు సంబంధించి.. ఏపీ ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు మంత్రి కోమటిరెడ్డి. పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు మంత్రి.

మంత్రి తుమ్మల లేఖ..

భేటీ కి ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ముఖ్యమంత్రికి లేఖ రాశారు.. భద్రాచలం విలీన గ్రామ పంచాయితీలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇద్దరు సీఎం లు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆరో తేదీన భేటీ నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకుల పాడు గ్రామ పంచాయితీలను భద్రాచలంలో కలిపేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో ఏడు మండలాలు విలీనమయ్యాయి.. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనం కావడంతో.. శ్రీ రాముడు కొలువైన రామాలయం తో టెంపుల్ టౌన్ భద్రాచలంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.

హరీష్ రావు ఏమన్నారంటే..

ఈ అంశం పొలిటికల్‌గానూ చర్చనీయాంశవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌కు లేఖరాయడంపై.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూర్చుని చర్చించుకోవడం మంచి పరిణామమేనన్న మాజీ మంత్రి హరీష్‌రావు… దీనికి కొన్ని కండిషన్లు సూచించారు. రాష్ట్రవిభజన జరిగిన కొత్తలో.. పోలవరం కోసం, ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చలు జరపాలని సూచించారు. దాని తర్వాతే మరేదైనా అన్నట్టుగా చర్చలు ఉండాలన్నారు హరీష్‌.

స్వాగతించిన కోదండరాం..

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని స్వాగతించారు తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాం. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలపై చర్చించడం మంచి పరిణామమన్నారు. సమస్యల పరిష్కారానికి తప్ప మరో మార్గం లేదన్నారు కోదండరాం. గతంలో కేసీఆర్, జగన్… కలిసి భోజనం చేశారు తప్ప, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్చించలేదని విమర్శించారు.

త్వరలో జరగబోతున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ సఫలం అవుతుందా? పదేళ్లుగా పడి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..