Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అదో మాదిరిగా కనిపించారు.. బ్యాగులు చెక్ చేయగా
అప్పుడే అబుదాబీ నుంచి విమానం హైదరాబాద్ చేరుకుంది. పాసింజర్లు ఒక్కొక్కరిగా ఫ్లైట్ దిగి.. ఎయిర్ పోర్ట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. అలా వచ్చినవారిలో ఇద్దరు వ్యక్తులపై అనుమానమొచ్చింది. అధికారులు ఆపి వారి లగేజి బ్యాగులు చెక్ చేయగా దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా..

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్న తరుణంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్ అధికారులు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అబుదాబీ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిని సూర్యప్రకాశ్, మహమ్మద్ జాహంగీర్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడి అధికారులు వీరిని తనిఖీ చేశారు. వీరిద్దరి లగేజీ బ్యాగ్‌లను పరిశీలించినప్పుడు అందులో డ్రోన్ కెమెరాలు, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు పెద్ద ఎత్తున ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని, నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ డ్రోన్ కెమెరాలు, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల మొత్తం విలువ దాదాపు మూడు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. సూర్యప్రకాశ్ నెల్లూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా, జాహంగీర్ చెన్నై వాసిగా గుర్తించారు. దీంతో కస్టమ్స్ అధికారులు ఈ ఘటనపై మరింత విచారణ ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమా, లేక మరే ఇతర ఉద్దేశ్యంతో దేశంలోకి తెచ్చారా అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది. అంతర్జాతీయ ప్రయాణికుల కదలికల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలను మరింత బలపరచినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ ఘటన తర్వాత అన్ని రాష్ట్రాల ఎయిర్‌పోర్టులలో సైతం కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒకేసారి మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు దొరకటంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు వీరిని విచారించిన తర్వాత కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
