హైదరాబాద్ IT కమిషనర్‌కే టోకరా.. రెప్పపాటులో బ్యాంక్ బ్యాలెన్స్ మాయం!
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు మాత్రమే కాదు. ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు సైబర్ దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్‌నే కేటుగాళ్లు బురిడి కొట్టించిన ఘటన చోటు చేసుకుంది. ఇంటికోసం ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేసిన..

హైదరాబాద్, నవంబర్ 16: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు మాత్రమే కాదు. ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు సైబర్ దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్‌నే కేటుగాళ్లు బురిడి కొట్టించిన ఘటన చోటు చేసుకుంది. ఇంటికోసం ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేసిన కమిషనర్ డబ్బులు చెల్లించే క్రమంలో సైబర్ నేరస్థులు అతడిని మోసం చేశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నట్టుగా చూపిస్తూ ‘jubliehillswinespot.in’ అనే నకిలీ వెబ్‌సైట్‌ను కేటుగాళ్లు రూపొందించినట్లు సైబర్ క్రైమ్ విచారణలో బయటపడింది. హోమ్ డెలివరీ కూడా చేస్తామని ప్రత్యేకంగా హైలైట్ చేసిన ఆ వెబ్‌సైట్‌ను నిజమైనదిగా భావించిన ఐటీ కమిషనర్, అక్కడి నుంచి వైన్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలోనే వెబ్‌సైట్ గూగుల్ పే ద్వారా ముందస్తు చెల్లింపు కోరింది. హోమ్ డెలివరీతో వస్తుందని నమ్మి కమిషనర్ వెంటనే రూ. 2320 గూగుల్ పే ద్వారా చెల్లించారు. కొద్ది నిమిషాల్లోనే ‘డెలివరీ కన్ఫర్మ్ చేసేందుకు మరొక స్కానర్ పంపుతున్నాం’ అంటూ కేటుగాళ్లు వాట్సాప్ ద్వారా ఒక QR కోడ్ పంపారు. దీన్ని స్కాన్ చేస్తే పేమెంట్ వెరిఫై అవుతుందని, అప్పుడు మాత్రమే డెలివరీ ప్రారంభమవుతుందని చెప్పారు. అనుమానించకుండా కమిషనర్ ఆ కోడ్‌ను స్కాన్ చేశారు. అదే క్షణం కమిషనర్ ఫోన్‌కు రూ. 40,000 డెబిట్ అయ్యిందని బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది.
అంత పెద్ద మొత్తంలో డబ్బు మైనస్ అయిన మెసేజ్ చూసిన కమిషనర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ QR కోడ్ స్కాన్ చేసిందే తన పొరపాటు అని గ్రహించారు. కేటుగాళ్లు చెల్లింపును వెరిఫికేషన్ పేరిట మళ్లీ తమ ఖాతాకు మళ్లించేలా మోసపూరిత QR కోడ్‌ను రూపొందించినట్లు స్పష్టమైంది. డబ్బు పోయిన సంగతి అర్థమైన వెంటనే ఐటీ కమిషనర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగాళ్ల వివరాలు, వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్స్, వాట్సాప్ చాట్స్ అన్నీ పోలీసులకు అందజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




