GHMC on Covid 19: థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం.. సర్కిళ్ల వారీగా ఐసోలేషన కేంద్రాలుః గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి
ఓమిక్రాన్ వ్యాప్తితో జనం ఓ మైగాడ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ప్రపంచానికే పెను సవాల్ గా మారిన కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ జడలు విప్పుతోంది.
GHMC on Coronavirus: ఓమిక్రాన్ వ్యాప్తితో జనం ఓ మైగాడ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ప్రపంచానికే పెను సవాల్ గా మారిన కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ జడలు విప్పుతోంది. హైదరాబాద్ లో నమోదవుతున్న కేసులు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ అప్రమత్తమైంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికు చేరుకుంటుండటంతో బల్దియా హెల్త్ డిపార్టమెంట్ అలర్ట్ అయింది. ముందునుంచి వ్యాక్సినేషన్ వందశాతం సక్సెస్ అయ్యేలా చర్యలు తీసుకున్న అధికారులు.. వైద్య శాఖ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ మహానగరంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మూడు రోజులుగా రికార్డు సంఖ్యలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. న్యూ ఇయర్ వేడుకల తర్వాత మళ్లీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ మహానగరం రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికు చేరువైంది. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఏకంగా 1520 కేసులు నమోదైతే అందులో రెండు వంతులపైగా హైదరాబాద్ లోనే నమోదుకావడం అందోళన కలిగించే అంశం. గత వారం నుంచి హైదరాబాద్ లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. డిసెంబర్ 30న -167, 31న -198, జనవరి 1న -217, జనవరి 2న -212, జనవరి 3న -294, జనవరి 4న -569, జనవరి 5న -979 పాజిటివ్ కేసులు వచ్చాయి.
కరోనా కేసులు వచ్చిన ప్రాంతాల్లో వైద్య శాఖ సమన్వయంతో బల్దియా సిబ్బంది వెంటనే శానిటైజేషన్ చేస్తున్నారు. కాలనీల వారీగా కేసుల పాజిటీవిటీ రేటును పరిగణలోకి తీసుకుంటున్నారు. కేసుల సంఖ్య పెరిగితే జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా ఐసోలేషన్ కేంద్రాలు రెడీగా ఉన్నాయని.. వాటి తెరిచి బాధితులకు సాయం అందిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు వెంటనే కరోనా సంబంధిత హెల్ప్ చేస్తున్నట్లు వివరించారు. అవసరం లేకుండా బయటకు రావొద్దని.. మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని మేయర్ నగరవాసులకు పిలుపునిస్తున్నారు.
బల్దియా ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐసోలేషన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పాజిటివ్ కేసులు పెరిగితే సర్కిళ్ల వారిగా ఐసోలేషన్ కేంద్రాలు ఓపెన్ చేస్తామన్నారు. కరోనా కేసులు వచ్చిన ప్రాంతాలను గుర్తించి, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని మేయర్ తెలిపారు. నగరంలో ఇప్పటికే వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నామన్న మేయర్.. బయట నుంచి సిటీకి వస్తున్నవారికి కూడా టీకాలు వేస్తున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులో ఉంటుందని విజయలక్ష్మీ పేర్కొన్నారు. సహాయం కోసం 040-21111111 డయల్ చేయాలని సూచించిన మేయర్.. అవసరమైనవారికి అందించేందుకు ఐసోలేషన్ కిట్స్, టెస్టింగ్, శానిటేషన్ వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు వైద్య శాఖ సూచనలు పాటించాలి. థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధంగా ఉన్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్పష్టం చేశారు.
Read Also… Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా టెన్షన్.. వైరస్ బారిన మరో కోలీవుడ్ హీరో..