Hyderabad: నగరవాసులకు గుడ్‌న్యూస్.. వేసవిలో ఆ సమస్య రాకుండా జలమండలి పక్కా ప్లాన్..

రానున్న ఎండాకాలంలో నగరంలో ఎటువంటి నీటి సమస్యలు లేకుండా హైదరాబాద్ జలమండలి తెలిపింది. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో..

Hyderabad: నగరవాసులకు గుడ్‌న్యూస్.. వేసవిలో ఆ సమస్య రాకుండా జలమండలి పక్కా ప్లాన్..
Water
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 14, 2023 | 7:39 PM

హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. రానున్న ఎండాకాలంలో నగరంలో ఎటువంటి నీటి సమస్యలు లేకుండా హైదరాబాద్ జలమండలి తెలిపింది. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, రెవెన్యూ, ట్రాన్స్‌మిషన్, ఓ అండ్ ఎం అధికారులతో మండలి ఎండీ దాన కిషోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఢోకా లేదని, అవసరం మేరకు తాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందని, మరో 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

మరోవైపు రానున్న వేసవిలో మే నెలాఖరు నాటికి మొత్తం 42 ఎంజీడీల నీరు అదనంగా.. అంటే నగర పరధిలో 22 ఎంజీడీలు, ఓఆర్ఆర్ లోపలి గ్రామాలకు 20 ఎంజీడీల నీరు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్చి నెలలో అదనంగా 22 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 14 ఎంజీడీలు ఇస్తుండగా.. నెలాఖరుకు మరో 8 ఎంజీడీల నీరు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ లో 12, మేలో 8 ఎంజీడీల నీరు అదనంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ – 2 కి 50 ఎంజీడీల నీరు:

జూన్ నాటికి ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు ఇప్పటికే 20 ఎంజీడీల నీరు ఇస్తుండగా.. అవసరాన్ని బట్టి మరో 30 ఎంజీడీల నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఈ ప్రాంత ప్రజలకు మొత్తం 50 ఎంజీడీల నీరు సరఫరా అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్) కింద మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

అదనపు ట్యాంకర్లు, ట్రిప్పులు:

నగరంలో అవసరమైన చోట్ల అదనంగా ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ఎండీ దాన కిషోర్ ఆమోదం తెలిపారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 74 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో 3 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అవసరం మేరకు ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి నీటి సరఫరా సమయాన్ని పెంచాలన్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలో కరెంటు కోతలు, మోటారు రిపేర్లు, తదితర సమస్యలు తలెత్తినప్పడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.

కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అలాగే కలుషిత జలాల సరఫరా కావటం వల్ల నీరు వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యను పరిష్కరించడానికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్ ఫ్లో లను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలన్నారు. అలాగే మ్యాన్ హోళ్ల నుంచి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్మిర్మాణం చేపట్టాలని, మ్యాన్ హోళ్ల కవర్లు కనిపించని స్థితిలో ఉన్నా.. వెంటనే కొత్త మూతలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రంజాన్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు:

రంజాన్ మాసం దృష్ట్యా అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడా సీవరేజి ఓవర్ ఫ్లో వంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. దీనికోసం డివిజన్ కొక మినీ జెట్టింగ్ మిషన్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీవరేజి పనులు జరిగినప్పుడు వెలికి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. కాగా, ఈ సమీక్షలో ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ట, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ -2 స్వామి, ఓ అండ్ ఎం, ట్రాన్స్ మిషన్ సీజీఎంలు, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..