Telangana: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ షో.. కేంద్ర ప్రకటనే నిదర్శనం: మంత్రి హరీష్
పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని, దీనికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు అని పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని, దీనికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు అని పేర్కొన్నారు. మంగళవారం నాడు బీఆర్ఎస్‌ఎల్పీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానంతో నిజాలు బయటకు వచ్చాయన్నారు. నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ షో అని కేంద్రం అంగీకరించకనే అంగీకరించిందన్నారు.
బీజేపీ చేసేది చారాన.. చెప్పేది బారానా అని విమర్శించారు. నోట్ల రద్దు గొప్పది కాదు గనుకే బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదని, మౌనం అంగీకారాన్ని సూచిస్తోందన్నారు. నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ తగ్గకపోగా 54 శాతం పెరిగింది అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయని వివరించారు మంత్రి హరీష్ రావు.
నోట్ల రద్దు మొదటి లక్ష్యం దొంగ నోట్లు అరికట్టడం అని, అయితే, ఇది అట్టర్ ప్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కరెన్సీ చలామణి తగ్గించి డిజిటల్ పేమెంట్స్ పెంచడం నోట్ల రద్దు మరో లక్ష్యం అంటూ.. ఇది కూడా అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కరెన్సీ చలామణి రెట్టింపు అయ్యిందని, నోట్ల రద్దుకు ముందు కరెన్సీ చలామణి జీడీపీలో 11 శాతం ఉంటే ఇపుడు 13 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు హరీష్ రావు.
పెద్ద నోట్ల చలామణి నోట్ల రద్దు తర్వాత రెట్టింపు అయ్యిందన్నారు మంతరి హరీష్ రావు. 500,1000 నోట్ల రద్దు అని చెప్పి ఏకంగా, రూ. 2 వేల నోటు తెచ్చారని, ఫలితంగా పెద్ద నోట్ల వినియోగం మరింత పెరిగిందన్నారు. పెద్ద నోట్ల వాడకం పతిమితం చేయాలనుకున్నారని, కానీ విపరీతంగా పెరిగిందన్నారు. సీబీడీటీ నే నల్ల ధనం భారీగా పెరిగిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
592 కేసుల్లో రూ. 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారని, నోట్ల రద్దుతో నల్లధనం ఉండదని లక్ష్యం పెట్టుకుని దాంట్లో కూడా అట్టర్ ప్లాప్ అయ్యారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. నోట్ల రద్దుతో తీవ్రవాద కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల రవాణా తగ్గుతాయని భ్రమింపజేశారని విమర్శించారు. ఈ మూడో లక్ష్యం కూడా అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ప్రణాళిక లేకుండా, ఆలోచన రహితంగా నోట్ల రద్దు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేశారని కేంద్ర ప్రభుత్వ విధానాలను తులనాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నారు. నోట్లు మార్చుకోవడానికి లైన్లలో నిలబడి 108 మంది మరణించారని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. మరెంతో మంది పరోక్షంగా దెబ్బ తిన్నారన్నారు. 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. కొత్త నోట్ల ముద్రణకు రూ. 21 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఈ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయ్యి ఉండేదన్నారు మంత్రి హరీష్ రావు. నోట్ల రద్దుతో 50 రోజుల్లో అంతా బాగుంటుందని పెద్దలు భరోసా ఇచ్చారని, 2 వేల రోజులైనా ఏం మార్పు రాలేదని విమర్శించారు హరీష్ రావు.
బీజేపీ వేసే ప్రతి అడుగు పేద ప్రజలపై పిడుగులా మారిందని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. నీతి ఆయోగ్ నేతి బీర కాయలో నెయ్యి చందంగా మారిందని విమర్శించారు. అప్పులు చేయడం, తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారిందన్నారు. కేంద్రం ప్రతి రోజూ చేస్తున్న అప్పు రూ. 4,618 కోట్లు కాగా, కోటీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మోదీ హయాంలో తెచ్చారన్నారు. రైతుల కోసం తెచ్చిన నల్ల చట్టాలపై క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ.. నోట్ల రద్దు పై కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం తగ్గక పోగా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుపై తక్షణమే శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
విదేశీ మారక నిల్వలు, రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతున్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు మంత్రి హరీష్ రావు. బీజేపీ ది డొల్ల ప్రచారం అని విమర్శించారు. ప్రజలను భ్రమల్లో ఉంచడం బీజేపీ విధానం అని దుయ్యబట్టారు. బీజేపీ వాగ్దానాల అమలుపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అన్నింట్లో దేశాన్ని దిగజార్చిన బీజేపీ.. మత పిచ్చి పెంచడంలో మాత్రం విజయం సాధించిందన్నారు. ‘బీజేపీ కో హాఠావో దేశ్ కో బచావో’ అనేదే తమ నినాదం అని మంత్రి హరీష్ రావు నినదించారు. ప్రధాని మీద నమ్మకంతో నాడు పెద్ద నోట్ల రద్దును సమర్ధించామని, కానీ, వారు చెప్పిన లక్ష్యాలను ఆచరణలో చూపలేదన్నారు. ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించి తీరాల్సిందేనని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..