AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. సప్లయ్‌కు సిద్దమైన గ్రీన్ వాటర్ ట్యాంకర్స్‌.. రేపట్నుంచే బుకింగ్స్‌

HMWSSB Green Water Tanker Bookings Open on October 31: నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మూడు రీజియన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ట్యాంకర్ల నమోదు, ఎస్టీపీల వద్ద ఫిల్లింగ్ పాయింట్ల ఏర్పాటు, వినియోగదారుల గుర్తింపు, ప్రభుత్వ శాఖలతో సమన్వయంపై దిశానిర్దేశం చేశారు.

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. సప్లయ్‌కు సిద్దమైన గ్రీన్ వాటర్ ట్యాంకర్స్‌.. రేపట్నుంచే బుకింగ్స్‌
Green Water Tankers In Hyderabad (1)
Anand T
|

Updated on: Oct 30, 2026 | 7:29 PM

Share

నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మూడు రీజియన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ట్యాంకర్ల నమోదు, ఎస్టీపీల వద్ద ఫిల్లింగ్ పాయింట్ల ఏర్పాటు, వినియోగదారుల గుర్తింపు, ప్రభుత్వ శాఖలతో సమన్వయంపై దిశానిర్దేశం చేశారు.

రాబోయే ఎల్‌నినో పరిస్థితులు, భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ ఫస్ట్‌ నుంచి హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది జలమండలి. శుద్ధి చేసిన మురుగునీటిని తాగునీటి యేతర పనులకు వినియోగించడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జలమండలి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

ప్రభుత్వ శాఖలకు తొలి ప్రాధాన్యం

ఇక తొలి దశలో జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, రహదారుల మధ్యనున్న పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. సచివాలయం, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, దుర్గం చెరువు, ఉప్పల్ స్టేడియం, ఐటీ సంస్థలు, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వినియోగదారులను గుర్తించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే నిర్మాణ రంగ సంస్థలకు కూడా నాణ్యత ప్రమాణాల మేరకు సరఫరా చేపట్టాలన్నారు.

ట్యాంకర్లు, ఫిల్లింగ్ పాయింట్ల సిద్ధత

ప్రతి ఎస్టీపీ వద్ద పంపులు, పైపులైన్లు, ఫిల్లింగ్ పాయింట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. 10 వేల, 20 వేల, 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లను నమోదు చేసి, గ్రీన్ వాటర్ బ్రాండింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ట్యాంకర్‌పై తాగడానికి పనికిరాదు – తాగేతర అవసరాలకు మాత్రమే అనే హెచ్చరిక స్పష్టంగా ఉండాలని సూచించారు.

అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

కార్యక్రమ పర్యవేక్షణకు ఎస్టీపీ సీజియం పద్మజను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ప్రతి ఎస్టీపీకి ప్రత్యేక అధికారి, ఓ అండ్ ఎం సమన్వయ అధికారి, ఫిల్లింగ్ స్టేషన్ ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు. నీటి నాణ్యత పరీక్షలు, ట్యాంకర్ల నమోదు, సరఫరా నిర్వహణపై సంబంధిత అధికారులు బాధ్యత వహించాలన్నారు.

యాప్, డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణ

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ ప్రక్రియను అక్టోబర్ 31 నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్యాంకర్ల నమోదు, బుకింగ్‌లు, సరఫరా వివరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం 56 ట్యాంకర్లు, 9 మంది వినియోగదారులు నమోదు చేసుకున్నట్లు అధికారులు వివరించగా, మరుసటి రోజుకల్లా 300 నుంచి 400 ట్యాంకర్ల నమోదుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించాలన్నారు.

అక్టోబర్ 31న క్షేత్రస్థాయి తనిఖీలు

అక్టోబర్ 31 ఉదయం అధికారులు తమకు కేటాయించిన ఎస్టీపీల వద్ద హాజరై ఫిల్లింగ్ పాయింట్లు, ట్యాంకర్ల రాకపోకలు, నీటి నాణ్యత, బుకింగ్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ట్రయల్ రన్ నిర్వహించి, మధ్యాహ్నం లోపు నివేదికలు సమర్పించాలన్నారు. అదే రోజు హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమన్వయ ఏర్పాట్లను ఖరారు చేయాలని సూచించారు.

తొలి ఐదు రోజులు ప్రత్యేక పర్యవేక్షణ

నవంబర్ 1న ఉదయం గ్రీన్ ట్యాంకర్ ద్వారా సరఫరా ప్రారంభించాలని, ప్రతి ఫిల్లింగ్ పాయింట్ వద్ద నాలుగు నుంచి ఐదు ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు తొలి రెండు మూడు ట్రిప్పులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. ప్రారంభమైన తొలి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు 24 గంటల పర్యవేక్షణ చేపట్టి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలు, నిర్మాణ పనులు, ఉద్యానవనాల నిర్వహణ (గార్డెనింగ్), ఇతర తాగేతర అవసరాలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. తద్వారా శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని పెంచడం, తాగునీటి వృథాను తగ్గించడం, భూగర్భ జలాలను సంరక్షించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని.. ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థలు తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us