ఆరుగాలం కష్టపడ్డారు.. పంటలను పశువులకు వదిలేశారు.. ఆ జిల్లా రైతుల కథ వింటే కన్నీరు ఆగదు!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతోంది. దీంతో చేతికొస్తాయనుకున్న పంటలను కళ్లముందే ఎండిపోతుండటంతో చూడలేక.. చివరకు పశువుల మేతకు వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోగా.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఒకప్పుడు పచ్చగా కనిపించిన పొలాలు.. ఇప్పుడు ఎండిపోయి ముదురు రంగులో కనిపిస్తున్నాయి. ఖరీఫ్‌లో ఎంతో ఆశతో సాగు చేసిన పంటలకు సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు ఏపుగా పెరిగి చేతికొస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు నీటి తడులు అందించలేక పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పంట పొలాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు అన్నదాతల కష్టాలకు అద్దం పడుతున్నాయి.
ఓ వైపు ఎల్‌నినో ప్రభావం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులు వెరసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, పంటలకు అవసరమైన నీరు అందకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. బోర్లలో నీరు అడుగంటడం, విద్యుత్ కోతలతో పంటలకు నీరు అందించే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో ఎంతో ఆశతో సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు రైతుల కళ్లముందే ఎండిపోయాయి. చివరకు పంటలను కాపాడుకోలేక పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ప్రకృతి ప్రకోపానికి తోడు సాగు కష్టాలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బోర్ల సాగుకు కరెంటు కష్టాలు
వర్షాలు లేకపోతే బోరు మోటార్లతోనైనా పంటలను కాపాడుకుందామనుకున్న రైతులకు అక్కడా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు విద్యుత్ కోతలు.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీరు రావడం లేదు. ఉన్న కొద్దిపాటి నీటిని పంటలకు అందించాలన్నా కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో పంటలకు సకాలంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. వర్షం కురవక.. బోర్లలో నీరు లేక.. విద్యుత్ సరఫరా సరిగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6,7 ఎకరాలు సాగుచేస్తే కేవలం ఒక ఎకరం, ఎకరంన్నర మాత్రమే చేతికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పంటలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన రైతులే.. ఇప్పుడు వాటిని పశువుల మేతకు వదిలేస్తున్నారు. నీరు లేక ఎండిపోయిన పంటలను చూసి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొస్తే అప్పులు తీర్చుకోవచ్చని ఆశించారు. కానీ పరిస్థితులు తారుమారు కావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంటను కాపాడుకోలేక… నష్టాన్ని భరించలేక అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.

మిగతా పంటలది అదే పరిస్థితి
ఒక్క వరి రైతులే కాదు పత్తి, మొక్కజొన్న, జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. వర్షాలు లేకపోవడంతో పత్తి పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉన్నా.. పంట చేతికి రాకపోతే రైతులకు ప్రయోజనం ఏముంటుంది? మొక్కజొన్న, జొన్న రైతులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు ఒకవైపు.. చేతికొచ్చే దిగుబడిపై అనిశ్చితి మరోవైపు.. అన్నదాతలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
పంట పండితేనే రైతు కుటుంబానికి భరోసా.. పంట చేతికొస్తేనే సాగు కోసం చేసిన అప్పులకు పరిష్కారం. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిస్థితులు రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. వర్షాభావం, కరెంటు కోతలు, భూగర్భ జలాల కొరతతో పంటలు ఎండిపోతుంటే.. పెట్టిన పెట్టుబడులు ఎలా తిరిగి వస్తాయో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఉండలేక పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి.. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
