AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Fever Survey: మహానగరంలో ఫీవర్ సర్వే .. మంగళవారం ఒక్కరోజే 40 వేల ఇళ్లలో వైద్య పరీక్షలు.. 1,487 మందికి జ్వరం గుర్తింపు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలకూ వైరస్‌ విస్తరించి వణికిస్తోంది.

Hyderabad Fever Survey: మహానగరంలో ఫీవర్ సర్వే .. మంగళవారం ఒక్కరోజే 40 వేల ఇళ్లలో వైద్య పరీక్షలు.. 1,487 మందికి జ్వరం గుర్తింపు
Hyderabad Fever Survey
Balaraju Goud
|

Updated on: May 04, 2021 | 10:39 PM

Share

Hyderabad Fever Survey: రాష్ట్రవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలకూ వైరస్‌ విస్తరించి వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రారంభమైన నాటి నుంచి కేసుల పెరుగుదల ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.రాష్ట్రంలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల పెరుగుదలతో ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో బెడ్ల కొరత, ఆక్సిజన్‌ కొరతకు దారితీస్తోంది. దీంతో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముమ్మరంగా ఫీవర్‌ సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టేలా ఫీవర్‌ సర్వే చేపట్టేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ప్రస్తుతం కరోనా లక్షణాలుగా పేర్కొంటున్న కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, నీరసం, విరేచనాలు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. ఫీవర్‌ సర్వేతో పాటు మరోవైపు పారిశుధ్య చర్యలను విస్తృతంగా చేపడుతున్నారు. బ్లీచింగ్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయడం వంటి చర్యలను ప్రారంభించారు. కంటైన్మెంట్‌ జోన్‌ ప్రాంతాల పైనా దృష్టిసారించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 641 బృందాలు ఇంటింటి సర్వే చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను చేపట్టారు. ఒక్కో బృందంలో ఒక ఏఎంఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజి వర్కర్‌తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి థర్మోస్కానర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ కిట్ అందజేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ మంగళవారం ఒక్కరోజే 40వేల ఇళ్లలో సర్వే చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ సర్వేలో 1,487 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిలో 1400 మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు వీరికి వెంటనే కోవిడ్ మందుల కిట్ అందజేశామని అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ఫీవర్ సర్వేలో జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.

సోమవారం నుండి హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో ప్రాథమికంగా 393 సర్వే బృందాలు పాల్గొంటున్నాయి. మంగళవారం ఈ బృందాల సంఖ్య 641 కు పెరగడంతో ఇవాళ ఒక్కరోజే 40 వేల ఇళ్లలో ఈ ఫివర్ సర్వే ముమ్మరంగా సాగింది. నగరంలోని ప్రతీ బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మంగళవారం అన్ని ఆసుపత్రుల్లో 18,600 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 3,600 మందికి స్వల్ప జ్వరాలు ఉన్నట్టు గుర్తించి వారికి కరోనా నివారణ మందుల కిట్లను అందజేశారు.

కరోనా కట్టలు తెంచుకుని విస్తరిస్తున్న తరుణంలో అధికారులు కట్టడి చర్యలపై దృష్టిసారిస్తున్నారు. తమ పరిధిలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే, ఆసుపత్రుల్లో జరిపిన ప్రాథమిక వైద్య పరిక్షలను సంబంధిత జోనల్, డిప్యూటీ కమీషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ కు కేవలం కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు గాను వచ్చిన దాదాపు 250 ఫోన్ కాల్స్ కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కంటైన్మెంట్‌ జోన్‌ ప్రాంతాల పైనా దృష్టిసారించేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also…  Suicide: ప్రేమ నిరాకరించిన యువకుడు.. శానిటైజర్ సేవించి యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటి ముందు బంధువుల ఆందోళన