AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కరోనా ఆంక్షలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.?

తెలంగాణ రాష్ట్రమంతా విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు(Sankranti Holidays) పొడిగించే అవకాశం కనిపిస్తోంది...

Telangana: కరోనా ఆంక్షలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.?
School Students
Ravi Kiran
|

Updated on: Jan 15, 2022 | 3:47 PM

Share

తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కోవిడ్ కేసులు విజృంభణతో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచి ఇచ్చింది. ఈ నెల 16 వరకు సెలవులు ఉండగా.. 17న స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు తెరవాల్సి ఉంది. కానీ కరోనా కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు సెలవులను పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హాలీడేస్ పొడిగిస్తేనే మేలని వైద్య ఆరోగ్య శాఖ కూడా సర్కార్‌కు సూచించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20 వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే నాలుగు రోజుల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం లేనందున ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఎక్కువ రోజులు హాలీడేస్ ఇస్తే ఈ విద్యాసంవత్సరంపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే రెండేళ్లు విద్యార్థులు నష్టపోయారంటున్న సర్కారు… సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆన్‌లైన్ వైపు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు గతేడాది రూపొందించిన ఆన్ లైన్, టీవీ పాఠాలు సిద్ధంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెబుతున్నాయి. కాగా, సెలవుల పొడిగింపుపై ఇంతవరకు స్పష్టత రాలేదు. సో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి రావాలా?.. లేక అక్కడే ఉండాలా? అన్న డైలమాలో ఉన్నారు. ఏదో ఒకటి చెబితే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటామని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ తరగతులను ఈ నెల 17 నుంచి 22 వరకు ఆన్ లైన్‌లోనే నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఇప్పటికే సర్క్యూలర్ కూడా విడుదల చేసింది. అయితే థర్డ్, పోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్‌టర్నల్ పరీక్షలను ముందుకు జరిపి థియరీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో సెలవుల పొడిగింపు ప్రచారానికి మరింత బలం చేకూరింది. కొన్ని రాష్ట్రాలు ఈ నెల 31 వరకు సెలవులు పొడగించడం, కరోనా పాజిటివిటీ రేటు విపరీతంగా పెరగడంతో విద్యాశాఖ అనౌన్స్ మెంట్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

(విద్యాసాగర్, టీవీ9 రిపోర్టర్)

Also Read: Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!