Hyderabad: జంటజలాశయాలకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత.. మూసీకి పెరిగిన ప్రవాహం
హైదరాబాద్ (Hyderabad) లో సోమవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి మరోసారి జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రెండు జలాశయాలు నిండుకుండల్లా ఉండటంతో ప్రాజెక్టులో చేరుతున్న నీటిని వచ్చినవి వచ్చినట్లుగానే...
హైదరాబాద్ (Hyderabad) లో సోమవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి మరోసారి జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రెండు జలాశయాలు నిండుకుండల్లా ఉండటంతో ప్రాజెక్టులో చేరుతున్న నీటిని వచ్చినవి వచ్చినట్లుగానే బయటకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్(Osman Sagar) రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 6 అడుగల మేర ఎత్తి 4,658 క్యూసెక్కులు నీటిని మూసిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు 4,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1787.55 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. 3.339 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు.. హిమాయత్‌సాగర్ (Himayat Sagar) జలాశయానికీ భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉండటంతో 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 3,910 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 2.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కాగా.. హైదరాబాద్ లో సోమవారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్ పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో వాన పడింది. అంతే కాకుండా వచ్చే మూడ్రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షసూచన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..