Telangana: అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలకు ఛాన్స్
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే మూడ్రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం అతిభారీ వర్షాలు, రేపు (బుధవారం) తెలంగాణలో తేలికపాటి....
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే మూడ్రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం అతిభారీ వర్షాలు, రేపు (బుధవారం) తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గురువారం తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షసూచన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. కాగా.. హైదరాబాద్ లో సోమవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్ (Ameerpet), పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లిలో భారీ వర్షానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి.
హైదరాబాద్ లో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. మలక్‌పేట వంతెన కింద వరద నీరు భారీగా నిలిచింది. దీంతో మూసారంబాగ్ వంతెన పై నుంచి నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. మీర్‌పేట, సరూరునగర్, కోదండరాం నగర్‌తోపాటు పలు కాలనీల్లోకి బారీగా వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటిస్తున్నారు.