‘ఆ స్కూల్‌లో ఫస్ట్ అడ్మిషన్లు అనాధ పిల్లలకే..’ ఎంఐఎం ఎమ్మెల్యే కీలక కామెంట్స్..
పిల్లలకు విద్యను అందించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకంమైదన్నారు చంద్రయన్ గుట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. పిల్లలను చూసుకునే బాధ్యత తల్లితో..

పిల్లలకు విద్యను అందించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకంమైదన్నారు చంద్రయన్ గుట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. పిల్లలను చూసుకునే బాధ్యత తల్లితో పాటు తండ్రిపై కూడా ఉంటుందన్నారు. పిల్లల పెంపకాన్ని కేవలం తల్లిపై వదిలేయడం సరికాదన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతలు తండ్రి తీసుకోవాలని సూచించారు. ఇక తన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పేరుతో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆయన.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పాతబస్తీలో ఒవైసీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నిర్మించారు. తాజాగా బాబా నగర్‌లో నిర్మించిన స్కూల్ కొత్త భవనాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.
ఈ స్కూల్‌లో ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలకు అడ్మిషన్ ఇస్తామని తెలిపారు అక్బరుద్దీన్ ఒవైసీ. ఫీజు కట్టులేని స్థితిలో ఉన్న వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పిల్లలకు అడ్మిషన్ తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ రావాలని సూచించారు. ఇద్దరిలో ఒకరు రాకపోయిన అడ్మిషన్లు ఇవ్వమని స్పష్టం చేశారు. విద్యార్థుల రిపోర్ట్ ఇచ్చే సమయంలోనూ తల్లిదండ్రులు రావాల్సిందేనన్నారు. పిల్లల చదువుపై పేరెంట్స్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
తమ స్కూల్‌లో పేద, అనాధ పిల్లలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఫస్ట్ కేటగిరీ అడ్మిషన్లు అనాధ పిల్లలకి కేటాయించామని, సీట్లు ఖాళీ లేకపోయినా కూడా విద్యను అందిస్తామన్నారు. ఇక సెకండ్ కేటగిరీలో తండ్రి లేదా తల్లి వదిలేసిన పిల్లలకు అడ్మిషన్లు ఇస్తామన్నారు. అలాగే తల్లిదండ్రులు ఎవరైనా వికలాంగులు ఉంటే వారి పిల్లలకు కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తమ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అక్బరుద్దీన్ ఒవైసీ. మీ పిల్లలు ఎంత వరకు చదివే అంత వరకు చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ స్కూల్స్‌లో సుమారు 15,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు అక్బరుద్దీన్ ఒవైసీ.


