AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthi travel rush: 2 రోజుల్లో ఏపీ వైపుకు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలుసా..?

హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది. సంక్రాంతి కోసం జనం ఊళ్లకు పరుగులు తీస్తున్నారు. బస్సు, రైలు, కారు ఏది దొరికితే అది పట్టుకుని వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి. ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. పూర్తి వివరాలు కథనంలో ..

Sankranthi travel rush: 2 రోజుల్లో ఏపీ వైపుకు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలుసా..?
Sankranti Travel Rush
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2026 | 12:59 PM

Share

హైదరాబాద్‌ టు విజయవాడ హైవేపై సంక్రాంతి ర్యాలీ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల దగ్గర వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి. పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. శనివారం అర్ధరాత్రి దాకా రెండు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుకు లక్షా 13వేల 553 వాహనాలు వెళ్లాయని అధికారులు చెబుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతుండడంతో చౌటుప్పల్‌, పంతంగి, చిట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌లు అవుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల దగ్గర రోడ్డు పనులతో..హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సివస్తోంది. పంతంగి టోల్‌ప్లాజాలో మొత్తం 16 టోల్‌బూత్‌లకు గాను 13 టోల్ బూత్‌ల ద్వారా వాహనాలను విజయవాడ వైపుకు పంపిస్తున్నారు.

సంక్రాంతి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవేపై వెళితే…ట్రాఫికర్‌ లేకుండా బేఫికర్‌గా వెళ్లిపోవచ్చు. ఇక ORR మీదుగా వెళ్లాలనుకునేవారు బొంగుళూరు గేట్‌ దగ్గర ఎగ్జిట్‌ తీసుకుని.. నాగార్జునసాగర్‌ హైవే పైకి వెళ్తే సరిపోతుంది. ఇక ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్‌ఆర్‌ పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్‌ తీసుకొని.. వరంగల్‌ హైవేలోకి ప్రవేశించొచ్చు. లేదా…సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్‌ మీదుగా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు.

అటు MGBS, JBS ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి 6,400 బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు. స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% చార్జీలు వసూలు చేస్తున్నా.. రెగ్యులర్‌గా నడిచే బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు నడుపుతుండడంతో.. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లలో హెవీ రష్‌ నెలకొంది. సంక్రాంతి నేపథ్యంలో 160కి పైగా స్పెషల్ రైళ్లు, 600కి పైగా రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశామన్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి, లింగంపల్లి,హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లలో ట్రైన్ హాల్టింగ్‌కు అవకాశం ఇచ్చారు.

అటు ఏపీలోని విజయవాడ బస్టాండ్‌ కూడా ప్రయాణికులతో కిటకిట లాడుతోంది. ఏపీఎస్ఆర్టీసీ..600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రెండు రోజుల్లో 3లక్షలమంది ప్రయాణించారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. స్త్రీ శక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.